Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ రద్దు! గృహ విక్రయాలపై ప్రభావం!!

‘కేవలం 20–25 శాతం సొమ్ము చెల్లించండి. గృహ ప్రవేశం చేయండి’
‘మీ గృహ రుణ వడ్డీ మీము చెల్లిస్తాం’
‘బ్యాంక్‌ నుంచి రుణం ఇప్పించడమే కాదు.. వడ్డీ కట్టే బాధ్యత కూడా మాదే’
.. ఇలా గృహ కొనుగోలుదారులకు ఆకట్టుకునే సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ రద్దు అయింది. దీని ప్రభావం గృహ విక్రయాలు, ప్రారంభాల మీద ప్రత్యక్షంగా పడుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌ (క్యూ2) త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద గృహాల విక్రయాల సంఖ్య సగానికి పైగా పడిపోయిందని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ తెలిపింది.
హైదరాబాద్, కోల్‌కతా, చెన్నైలో జీరో సేల్స్‌..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)లో 280 ప్రాజెక్ట్‌లలో 69,000 గృహాలు ప్రారంభమయ్యాయి. ఇందులో కేవలం 8 శాతం ప్రాజెక్ట్‌లు అంటే 23 ప్రాజెక్ట్‌లలో 7,620 గృహాలకు మాత్రమే సబ్‌వెన్షన్‌ పథకం కింద విక్రయమయ్యాయి. ముంబైలో 17 ప్రాజెక్ట్‌లు, బెంగళూరులో 4, ఎన్‌సీఆర్‌లో 1, పుణెలో 1, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై నగరాల్లో సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్‌ కూడా విక్రయం కాలేదు.
ప్రభావం చిన్న డెవలపర్లకే
ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ను ఆసరాగా చేసుకొని గృహ రుణాలను తీసుకున్నారని, నిధులను దారి మళ్లించారనే ఆరోపణ నేపథ్యంలో నేషనల్‌ హౌజింగ్‌ బోర్డ్‌ (ఎన్‌హెచ్‌బీ) సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేయాల్సిందిగా బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సబ్‌ వెన్షన్‌ స్కీమ్‌ కేవలం చిన్న డెవలపర్లు, ఎక్కువ సంఖ్యలో గృహాలున్న ప్రాజెక్ట్‌ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. బడా నిర్మాణ సంస్థలు, డెవలపర్లుకు ఆర్ధిక సంస్థలు మద్దతు ఇస్తుండటంతో కొనుగోలుదారులను ఆకర్షించి, విక్రయాలు చేస్తున్నారని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.
సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ అంటే?
ప్రాపర్టీ కొనుగోలు సమయంలో కస్టమర్‌ ప్రాపర్టీ ధరలో 20–25 శాతం సొమ్మును ముందస్తుగా చెల్లిస్తాడు. మిగిలిన మొత్తాన్ని గృహ రుణం రూపంలో బ్యాంక్‌ డెవలపర్‌కు చెల్లిస్తుంది. అయితే ఈ గృహ రుణం వడ్డీని కస్టమర్‌ పేరిట డెవలపర్‌ బ్యాంక్‌కు చెల్లిస్తాడు. నిర్మాణం పూర్తయి.. కస్టమర్‌కు అందించిన తర్వాతే కస్టమర్‌కు నెలవారీ వాయిదా (ఈఎంఐ) మొదలవుతుంది. దీన్నే సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ అంటారు. సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ రుణాలతో గృహ కొనుగోలుదారులకు వడ్డీ భారం తగ్గుతుంది. అయితే కస్టమర్ల తరఫున డెవలపర్‌ చెల్లించే వడ్డీని.. డెవలపర్‌ ప్రాపర్టీ ధరలను పెంచి వడ్డీ భారాన్ని భర్తీ చేసుకుంటాడు. ఈ తరహా రుణాలను వ్యవసాయ, విద్యా రంగాలకు కూడా అందిస్తుంటారు. సాధారణంగా ఈ స్కీమ్‌ కింద చెల్లింపుల నిష్పత్తి కొనుగోలుదారులు, డెవలపర్లు, బ్యాంక్‌ల మధ్య 5:90:5 స్థాయిలో ఉంటుంది.
సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద విక్రయాలు నగరాల వారీగా..
నగరం ప్రాజెక్ట్‌ల సంఖ్య గృహాల సంఖ్య
బెంగళూరు 4 1,310
ముంబై 17 5,310
ఎన్‌సీఆర్‌ 1 740
పుణె 1 260
మొత్తం 23 7,620

Related Posts

Latest News Updates