ఉస్మానియా యూనివర్సిటీ 82వ కాన్వొకేషన్ ఇవ్వాళ జరగనుంది. యూనివర్శిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తామని ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ వెల్లడించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేస్తామని వీసీ వెల్లడించారు. ఈసారి 31 మందికి గోల్డ్‌మెడల్స్, 260 మందికి పీహెచ్డీ పట్టాలు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. సాయంత్రం 6 గంటలకు స్నాతకోత్సవం ప్రారంభమవుతుందని, విద్యార్థులు అరగంట ముందే రావాలని సూచించారు.
అయితే పాసులు లేని వారికి అనుమతి లేదని వీసీ తేల్చి చెప్పారు. అయితే.. విద్యార్థులు అర్ధగంట ముందే ప్రాంగణానికి రావాలని సూచించారు. పాస్ కలిగిన విద్యార్థితో మరొకర్ని మాత్రమే అనుమతిస్తామన్నారు. పార్కింగ్ కోసం కూడా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గోల్డ్‌మెడల్స్ అందుకోనున్న 31 మందిలో 27 మంది, పీహెచ్ డీ పట్టాలు అందుకోనున్న 260 మందిలో 146 మంది అమ్మాయిలు ఉన్నారని వీసీ రవీంద్ర యాదవ్ తెలిపారు. ఇక… స్నాతకోత్సవం సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 300 మంది పోలీసులను ఇందుకోసం వినియోగిస్తున్నారు.