Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మేడికుంటకు ఫోనిక్స్‌ బ్యూటీ

చెత్త చెదారం, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో దుర్వాసనను వెదజల్లే మేడికుంటకు మహర్ధశ పట్టనుంది. నానక్‌రాంగూడ విప్రో సర్కిల్‌కు ఆనుకొని కళావిహీనంగా ఉండే మేడికుంటను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఫోనిక్స్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. వ్యర్థాలను తొలగించడమే కాకుండా తటాకాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించే బాధ్యతలను ఎత్తుకుంది.
విప్రో దత్తతకు తీసుకున్నా..
మేడికుంట సుందరీకరణను గతంలో విప్రో సంస్థ దత్తత స్వీకరించినప్పటికీ, జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖ నిధులు కేటాయించినా ఆశించిన స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఇప్పుడు జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేసేందుకు ఫోనిక్స్‌ ఫౌండేషన్‌ ముందుకొచ్చింది. గత నెల రోజులుగా మేడికుంటలో వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు కూడా. గట్టుపై పేరుకపోయిన చెత్తా చెదారం, వ్యర్థాలు, నీటిపై మొలచిన పిచ్చి మొక్కలను తొలగించారు.
నానో టెక్నాలజీ వినియోగం..
చెరువులోని నీటిని శుభ్రం చేయడం, తొలగించడం కోసం నానో టెక్నాలజీని వినియోగించనున్నారు. ఈ సాంకేతికతతో ఒకే దఫాలో తక్కువ వ్యయంతో పూర్తి పరిశుభ్రం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. చెరువులోని వివిధ ప్రాంతాల్లో నానో క్లస్టర్ల ఆధారంగా చేసే ఈ ప్రక్రియను నో రిజెక్ట్‌ ట్రీట్‌మెంట్‌గా పేర్కొంటారు. హై ఆస్పెక్ట్‌ రేషియో, రియాక్టివిటీ, ఎలక్ట్రోస్టాటిక్, హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్‌ ఇంటరాక్షన్స్, ట్యూనబుల్‌ పోర్‌ వాల్యూమ్‌ ఆధారంగా పనిచేసే నానో మెటీరియల్స్‌ వల్ల ఈ శుభ్రతలో భాగంగా నీటిని శోధించడం, శుద్ధి చేయడం, మలినాలు తొలగింపు వంటి ప్రక్రియలు అత్యంత సమర్థంగా సాగుతాయి. నీటిశుద్ధి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నానో క్లస్టర్లు పెద్దగా విస్తరించబడి అక్కడే స్థిరీకరించబడి ఉండటమే కాకుండా మైక్రో న్యూట్రియెంట్లుగా కూడా వ్యవహరించబడుతాయి. ఇక చివరి ప్రక్రియలో చెరువులోకి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయడం, మలినాలు తొలగింపు, ప్రవామాను అడ్డుకుట్ట వేయడం వంటివి చేపడుతారు. ప్రస్తుతం ప్రారంభించిన ఈ ప్రక్రియను మూడు నెలల నుంచి నాలుగునెలలపాటు కొనసాగిస్తారు.
సుందరీకరణ కోసం..
మేడికుంట గట్టుపై మొక్కలను నాటి, పరిరక్షించడం, నీటిని అందేలా ఏర్పాట్లు చేస్తారు. పచ్చిక బయళ్లు ఏర్పాటు, పరిరక్షణ, వాటి నిర్వహణ బాద్యత చేపడుతారు. వాకర్స్‌ కోసం చెరువు గట్టుపై వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తారు. సెక్యూరిటీ గార్డులను నియమిస్తారు. చెరువులోకి ఎలాంటి మురుగునీరు, రసాయనాలు చేరకుండా చర్యలు తీసుకుంటారు. ఫెన్సింగ్, ఫుట్‌పాత్‌ల పరిరక్షణ, ఇతర స్ట్రక్చర్లు, సివిల్‌ వర్క్‌లను నిర్వహిస్తారు. చెరువు పరిసరాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేదిస్తారు.

Related Posts

Latest News Updates