ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్లను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. విశాఖ ఏయూ కన్వెక్షన్ సెంటర్ లో పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటికి తీసి, రీసైకిల్ చేస్తుంది. పలు ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. ప్లాస్టిక్ బ్యానర్ల స్థానంలో బట్ట బ్యానర్లనే వాడాలని స్పష్టం చేశారు. టీటీడీ ఇప్పటికే విజయవంతంగా ప్లాస్టిక్ నిషేధాన్ని కొనసాగిస్తుందోని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.
విశాఖ లో సాగర తీర స్వచ్ఛత కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సాగర తీరంలో 20 వేల మందితో 28 కిలోమీటర్ల మేర బీచ్ క్లీనింగ్ చేపట్టామని, 76 టన్నుల ప్లాస్టిక్ తొలగించామని పేర్కొన్నారు. ఇకపై ఎంత పెద్ద సభ అయినా… బట్టతో చేసిన బ్యానర్లనే వాడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సంకల్పంగా ముందుకు సాగాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్తిక పురోగతి నాణేనికి రెండు వైపులని పేర్కొన్నారు. ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిదీ అని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు.