గుజరాత్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ క్యూ లైన్లో నిల్చొని మరీ… తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ లోని రాణిప్ అనే ప్రాంతంలో వున్న పోలింగ్ కేంద్రంలో ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్ రాజభవన్ నుంచి మోదీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. రాణిప్ లోని పోలింగ్ కేంద్రానికి తన కాన్వాయ్ లో వచ్చి, ఆ కాన్వాయ్ ను కొంత దూరంలోనే నిలిపేసి… నడుచుకుంటూ పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లారు. ఆ తర్వాత సామాన్యుడి లాగే… క్యూ లైన్లో నిల్చొని, మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ ప్రజలందరూ పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని, ప్రజాస్వామ్య పండగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఓటింగ్ పూర్తైన తర్వాత ప్రధాని మోదీ పోలింగ్ స్టేషన్ ముందు మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ప్రజలు ఓట్లతో ప్రజాస్వామ్య పండగను జరుపుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ వాసులు కూడా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత వాసులకు ధన్యవాదాలు ప్రకటిస్తున్నా. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలుపుతున్నా అంటూ మోదీ తెలిపారు.
గుజరాత్ లో రెండో దశ పోలింగ్ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ స్టేషన్ల వద్ద బారులుతీరారు. 14 జిల్లాల పరిధిలోని 93 అసెంబ్లీ సీట్లలో చివరి విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 833 మంది బరిలో ఉండగా.. 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక… గుజరాత్ సీఎంతో సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.