కొత్తగా ఏర్పడిన పోచారం మున్సిపాలిటీకి నిధుల గండం పట్టుకుంది. అభివృద్ధి పనుల కోసం కొత్తగా ఏర్పడిన ఇతర మున్సిపాల్టీలకు ప్రభుత్వం నిధులు మంజూరు అవుతుంటే.. పోచారం మున్సిపాల్టీకి ఇంతవరకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. నిధుల కోసం ప్రభుత్వానికి ఇప్పటి వరకు ప్రతిపాదనలు కూడా పంపలేదు. నిధులు రాబట్టడానికి కృషి చేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
రూ. 50.50 కోట్ల నిధులు కోసం ప్రతిపాదనలు..
మున్సిపాల్టీలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ. 50.50 కోట్ల నిధులు కావాలని ప్రభుతానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మురుగు నీటి వ్యవస్థ, రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు, శ్మశాన వాటికలు, పార్కులు, తాగునీటి వసతి వంటి పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కావాలి. నిధులు మంజూరైతేనే అభివృద్ధి పనులు ముందుకు సాగుతాయి. అప్పుడే పోచారం రూపురేఖలు మారతాయి.
కార్యరూపంలోకి రాని పనులు..
స్థానిక ఎమ్మెల్యే, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పురపాలక సంఘ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయటమే తప్ప కొత్తగా అభివృద్ధి ఏమీలేదని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కంటే పోచారం మున్సిపాల్టీకి వచ్చే ఆదాయం చాలా తక్కువ. రూ. 4.5 కోట్లతోనే పురపాలక సంఘ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.
సిబ్బంది కొరత..
సిబ్బంది కొరతతో 64 శాతమే ఆస్థిపన్ను వసూలైంది. మున్సిపల్ కార్యాలయంలో నలుగురే ప్రభుత్వ సిబ్బంది. మిగిలిన వారంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. కార్యాలయంలో ఇంకా కొన్ని విభాగాలు ఏర్పడాల్సి ఉంది. ఎప్పటికి వాటి సేవలు అందుబాటులోకి వస్తాయే తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే నిధుల నుండి రూ. 10 లక్షలు మంజూరు చేశారు. అందులో రూ. 5 లక్షలు విడుదల చేశారు. వీటితో వీధి దీపాలు కొనుగోలు చేయనున్నారు.