Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కాగితాలపైనే పరిశ్రమల తరలింపు!

హైదరాబాద్‌లో పర్యావరణ హననానికి కారణమౌతోన్న కాలుష్య కారక పరిశ్రమలను దశలవారీగా నగరానికి దూరంగా తరలించే అంశం ఏడాదిగా కాగితాలకే పరిమితమైంది. ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) కాలుష్య కారక పరిశ్రమలను రాజధాని గ్రేటర్‌ హైదరాబాద్‌కు దూరంగా తరలిస్తామని హడావుడి చేసింది. ఇందులో భాగంగా రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ కిందకు వచ్చే అత్యంత కాలుష్య కారక 500 కంపెనీలను వికారాబాద్, జహీరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తామని ప్రకటించింది. ఇక కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులు మంజూరు చేసిన వెంటనే మరో 600 బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ కంపెనీలను ముచ్చెర్లలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయనున్న ఫార్మాసిటీకి తరలిస్తామని ప్రకటించినప్పటికీ అడుగు ముందుకు పడకపోవడం గమనార్హం. కాగా పరిశ్రమల తరలింపులో ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్‌ తదితర ప్రాంతాల్లోని బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ ఆధార పరిశ్రమలున్నాయి.
తరలిస్తారో..లేదో..?
గ్రేటర్‌ పరిధిలో కాటేదాన్, జీడిమెట్ల, మల్లాపూర్, బాలానగర్, ఉప్పల్, పాశమైలారం తదితర పారిశ్రామిక వాడలున్నాయి. వీటిలో ప్రధానంగా బల్క్‌డ్రగ్, ఆయిల్, ఇంటర్మీడియెట్స్, ప్లాస్టిక్, రబ్బర్, స్టీలు విడిభాగాల తయారీ వంటి కాలుష్య కారక పరిశ్రమలున్నాయి. వీటి కారణంగా మహానగరం పరిధిలోని 185 చెరువుల్లో సుమారు 100 కాలుష్యకాసారంగా మారాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలను ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్యకాసారంగా మారాయి. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరవాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌ రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.
గ్రేటర్‌లో రోజురోజుకూ పెరుగుతోన్న కాలుష్యం..
వాయు కాలుష్యం: నగరంలో వాహనాల సంఖ్య 50 లక్షలకు చేరువైంది. ఇందులో కాలంచెల్లిన వాహనాలు సుమారు 15 లక్షల వరకు ఉన్నాయి. వీటి నుంచి వెలువడుతోన్న పొగలో పలు ప్రమాదకర వాయువులున్నాయి. మరోవైపు పరిశ్రమలు వెదజల్లుతోన్న వాయుకాలుష్యంతో సిటీజన్లకు స్వచ్ఛమైన ప్రాణవాయువు దూరమౌతోంది.
జలాశయాల కాలుష్యం: నగరంలో సుమారు 185 చెరువులుండగా.. ఇందులో 100 చెరువులు ఆర్గానిక్‌ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి నిత్యం వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలు ఆయా జలాశయాల్లో చేరి పర్యావరణం హననం అవుతోంది. ఆయా జలాశయాల నీరు కాలుష్యకాసారమౌతోంది.
నేల కాలుష్యం: బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్‌ కంపెనీల నుంచి వెలువడుతోన్న ఘన, ద్రవ కాలుష్య ఉద్గారాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో ఆయా ఉద్గారాల్లోని భారలోహాలు, మూలకాలు వర్షం పడినపుడు నేలలోపలికి ఇంకుతున్నాయి. దీంతో భూగర్భజలాలు సైతం కాలుష్యకాసారంగా మారుతున్నాయి. ప్రధానంగా వ్యర్థజలాల్లో మెర్క్యురీ, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్, మాంగనీస్, కాపర్, కోబాల్ట్‌ వంటి మూలకాలుండడంతో నేల కాలుష్యం సంభవిస్తోంది.

Related Posts

Latest News Updates