Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గచ్చిబౌలిలో నాల్గెకరాల స్థలాన్ని కబ్జా చేసిన ప్రగతి సోషల్‌

హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో భూమిని కాజేశారు కబ్జాదారులు. గచ్చిబౌలిలో సర్వే నెంబర్‌ 32లోని నాలుగు ఎకరాల స్థలాన్ని ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ కబ్జా చేసింది. ఆక్రమణకు గురైన ఈ స్థలం విలువ సుమారు రూ.180 కోట్ల వరకుంటుందని సమాచారం. స్థలం యజమానులు ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులకు ఇప్పటికే కేసు నమోదు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం తెల్లవారు జామున ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ కమిటి సభ్యులు, ఇళ్లలో నివాసం ఉండే వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. తప్పుడు పత్రాలతో స్థలం తమదేనని నమ్మబలుకుతూ అమాయకులకు అమ్మి లక్షలు దండుకున్న ప్రగతి సొసైటీ కమిటీ సభ్యులతో పాటు మోసాలకు పాల్పడ్డ 25 మందిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు.
వివాదాస్పద స్థలం ఇదే….
గచ్చిబౌలిలోని సర్వే నెంబర్‌ 32లోని నాలుగు ఎకరాల స్థలం ఐటీ కంపెనీలను ఆనుకొని ఉంటుంది. ఐఐసీ సిస్టమ్స్‌కు 3 ఎకరాలు, బ్రిజేష్‌ కోహల్‌కు 20 గుంటలు, బాబురావు 20 గుంటల స్థలం ఉంది. 2000 సంవత్సరంలో వారు స్థలాన్ని కొనుగోలు చేశారు. యూఎల్‌సీ పరిధిలో ఉండటంతో 2005లో వారికి ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 2014 వరకు యజమానులు పొజీషన్‌లో ఉన్నారు. ఆ తరువాత ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకురాలు, కమిటీ సభ్యులు సదరు స్థలాన్ని క్రమించారు. ఆక్రమించిన స్థలాన్ని తమదే స్థలమని నమ్మించి అమ్మి సొమ్ము చేసుకున్నారు. 165 మంది గదులను నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ప్రగతినగర్‌గా నామ కరణం చేశారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ నుంచి ఇంటి నెంబర్లు, ఎలక్ట్రిసిటీ మీటర్లు తీసుకున్నారు.


తప్పుడు పత్రాలతో మోసం….
మొబైల్‌ వెల్‌ఫేర్‌ సొసైటీ నిర్వాహాకులు ధర్మరాజు 1991లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గచ్చిబౌలిలోని వివిద సర్వే నెంబర్‌లలో 99 ఎకరాలు పట్టా ఇచ్చినట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. దీంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు ధర్మరాజుపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ధర్మరాజు ప్రగతి సొషల్‌ ఆర్గనైజేషన్‌కు శామిర్‌పేట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి లీజు డీడ్‌ ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ధర్మరాజుపై సైఫాబాద్, మాదాపూర్, సీసీఎస్‌లో కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో గచ్చిబౌలి సర్వే నెంబర్‌ 32లో నాలుగు ఎకరాల స్థలం తమదే నని ఆక్రమించారని పోలీసులు పేర్కొంటున్నారు.
సుప్రీ కోర్టు ఆదేశాలతో దర్యాప్తు….
సర్వే నెంబర్‌ 32లో కబ్జాకు గురైన స్థలంపై సుప్రీం కోర్టు ఆదేశాలతోనే దర్యాప్తు చేస్తున్నామని రాయదుర్గం సీఐ ఎస్‌.రవిందర్‌ తెలిపారు. తమ స్థలాన్ని కబ్జా చేశారని 2017, 2018లో ఐఐసీ సిస్టమ్స్, బ్రిజేష్‌ కోహల్, బాబురావు ఫిర్యాదు చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు సింగిల్‌ జడ్జీ ధర్మరాజుకు 99 ఎకరాలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ పట్టా ఇచ్చినట్లుగా చూపించిన డాక్యుమెంట్‌ నకిలీదని సుప్రీం కోర్టు తేల్చిందన్నారు.అంతే కాకుండా సుప్రీం కోర్టు డివిజన్‌ బెంచ్‌ దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలని సైబరాబాద్‌ కమిషనర్‌ను ఆదేశించిందన్నారు. ఈ క్రమంలోనే ప్రగతి నగర్‌ సోషల్‌ ఆర్గనైజేషన్‌ కమిటీ సభ్యులతో పాటు ఉద్ధేష్యం పూర్వకంగా నాలుగైదు ప్లాట్లు కొనుగోలు చేసి అమ్ముకున్న వారిని అరెస్ట్‌ చేస్తామని తెలిపారు. నాలుగు ఎకరాల స్థలంలో 90 చదరపు గజాల చొప్పున 165 ప్లాట్లు చేశారని వివరించారు. ఒక్కో ప్లాట్‌ను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు విక్రయించి అమాయకులను మోసం చేశారని చెప్పారు. 70 మంది బాధితులను విచారించి వాగ్మూల్యం సేకరించామని, నిందితులపై ఐపీసీ 420, 468, 471, 474 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

అరెస్ట్‌ ఆయ్యింది వీరే….
ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకురాలు కంచి నాగమణి, కంచి సురెందరయ్య, ఇ. ముత్తు, జి. చెన్నయ్య, ఎం. విక్రమ్, భాస్కర్‌రావు, తలారి రాము, లక్ష్మీబాయి, వి. గోవిందమ్మ, బి. సంతోష, ఏ. జాములు, ఎల్‌. కోటయ్య, ఎం. శివకుమార్, ఎల్‌. పాండు, ఎన్‌. జీవన్‌కుమార్, ఎన్‌. దానేడప్ప, బి. శివాజీ, ఎస్‌. రవీందర్, వి. సుధాకర్, కె. సుందర్‌రావు, కోటేశ్వర్‌రావు, ఎం.యాదగిరి, ఎం. అశోక్, కె. భాస్కర్, జి. ఝాన్సీలు ఉన్నారు. పరారీలో పి. ఆగమ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుజాత, «కె. ధర్మరాజు, జి. రామారావు, పి. శ్రీనివాస్‌రావు, డి. సతీష్‌లు ఉన్నారు. నోటీసులు ఇవ్వకుండా రాయదుర్గం పోలీసులు తమను అరెస్ట్‌ చేశారని ప్రగతి సోషల్‌ ఆర్గనైజేషన్‌ నిర్వాహకురాలు నాగమణి భర్త సురెందరయ్య ఆరోపించారు. స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని, సొసైటీ సభ్యులే నివాసం ఉంటున్నారని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates