రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము చేతిలో ఓడిపోయిన విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన తదుపరి రాజకీయ జీవితంపై స్పందించారు. ఇకపై.. తాను ఏ పార్టీకీ మద్దతివ్వనని, స్వతంత్రునిగా కొనసాగుతానని ప్రకటించారు. అయితే.. రాబోయే రోజుల్లో ప్రజా సేవ ఏవిధంగా చేయాలన్న దానిపై కూడా ఇంకా ఓ క్లారిటీకి రాలేదని పేర్కొన్నారు. స్వతంత్ర రాజకీయ వేత్తగా మాత్రమే కొనసాగుతా.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరను అని సిన్హా ప్రకటించారు.
అయితే ఇప్పటికీ మమతా సారథ్యంలోని టీఎంసీతో టచ్ లోనే వున్నారని అడగ్గా… కేవలం వ్యక్తిగత సంబంధాలను మాత్రమే ఆ పార్టీతో కొనసాగిస్తున్నానని అన్నారు. రాజకీయ పార్టీలేవీ తనను సంప్రదించలేదని, తానూ ఎవ్వరితోనూ మాట్లాడలేదని ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను ప్రకటించారు. దీంతో ఆయన టీఎంసీకి రాజీనామా చేసి, రాష్ట్రపతి ఎన్నికల్లో నిలబడ్డారు. ఇక.. ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో నిలిచారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో యశ్వంత్ సిన్హా ఓడిపోయారు. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచారు.