ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి గదులు నిర్మిస్తున్న వైనాలు కోకొల్లలు. కానీ కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో మాత్రం ఏకంగా ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసి మరీ గృహాన్ని నిర్మిస్తున్నాడో ఘనుడు. పద్మానగర్ ఫేజ్–2 రోడ్డు నంబరు– 8లో ఓ వ్యక్తి రోడ్డునే కబ్జా చేసి గదిని నిర్మించడం విస్మయానికి గురిచేస్తోంది. సదరు అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ యాప్‌లో స్థానిక సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కూల్చేస్తాం..
కబ్జాకు కాదేది అనర్హం అన్న చందంగా రోడ్డును ఆక్రమించి అదనపు గదిని నిర్మించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పద్మానగర్‌లో రోడ్డు పక్కనే ఇలా రెండు రోజుల వ్యవధిలో కాంక్రిట్ స్లాబ్‌తో గది నిర్మించడంతో వాహనాలు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల సర్కిల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్‌కుమార్ సదరు ఫిర్యాదు విషయంపై స్పందించి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. సిబ్బందితో రెండు, మూడు రోజుల్లో సదరు నిర్మాణాన్ని నేలమట్టం చేస్తామని అధికారులు తెలిపారు.