Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

గడువు ముగిస్తే.. రిజిస్ట్రేషన్, లీజు రద్దు

డెవలపర్లు తస్మాత్‌ జాగ్రత్త! నిర్మాణ గడువు ముగిసినా సరే ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తున్నారా? కొనుగోలుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారా? అయితే మీ రెరా, ల్యాండ్‌ లీజ్, రిజిస్ట్రేషన్స్‌ అన్నీ రద్దు అవుతాయి. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్‌ ఈ మేరకు నోయిడాకు చెందిన ఆమ్రపాలి గ్రూప్‌ విషయంలో సంచలన తీర్పును వెల్లడించింది.
గృహ కొనుగోలుదారులకు సకాలంలో ఇల్లు అందించకుండా సతాయించిన ఆమ్రపాలి గ్రూప్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే బాధ్యతలను నేషనల్‌ బిల్డింగ్స్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ)కి అప్పగిస్తూ సుప్రీకోర్ట్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమ్రపాలి ప్రాజెక్ట్‌లో ఫ్లాట్లను బుక్‌ చేసిన 42 వేల మంది కొనుగోలుదారులకు ఊరట లభించింది.
గ్రూప్‌ సీఎండీ అనిల్‌ శర్మతో పాటూ ఇతర డైరెక్టర్లు, సీనియర్‌ అధికారులపై ఉన్న మనీల్యాండరింగ్‌ అభియోగాలపై విచారణ జరపాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఈడీ)ని ఆదేశించింది. కోర్ట్‌ రిసీవర్‌గా సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్‌ వెంకటరమణిని నియమించింది. లీజుల రద్దు తర్వాత నుంచి ప్రాపర్టీలపై పూర్తి అధికారాలు కోర్ట్‌ రిసీవర్‌కు దఖలుపడతాయని తెలిపింది. బకాయిలు రాబట్టే క్రమంలో గ్రూప్‌ ప్రాపర్టీల విక్రయానికి రిసీవర్‌కే పూర్తి అధికారాలుంటాయి.
అదనపు డబ్బులు వసూలు చేయొద్దు..
ఆమ్రపాలి పెండింగ్‌ ప్రాజెక్ట్‌లను శరవేగంగా పూర్తి చేసి, కొనుగోలుదారులకు అప్పగించాలని ఎన్‌బీసీసీని ఆదేశించింది. ఈక్రమంలో కొనుగోలుదారుల నుంచి అదనంగా నిధులు వసూలు చేయరాదని స్పష్టం చేసింది కూడా! ప్రమోటర్లతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కస్టమర్లు మిగతా మొత్తాన్ని మూడు నెలల్లో ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని సూచించింది.
మహేంద్రసింగ్‌ ధోని కూడా బాధితుడే..
భారత క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని కూడా ఆమ్రపాలి గ్రూప్‌ బాధితుడే. 2011లో ప్రపంచకప్‌ గెలిచిన భారత క్రికెటర్లు అందరికీ నోయిడాలోని ప్రాజెక్ట్‌లో రూ.9 కోట్ల విలువ చేసే విల్లాలను ఇస్తామని ఆమ్రపాలి ప్రకటించింది. వాటిని కట్టనూ లేదు. అంతేకాదండోయ్‌.. ఆమ్రపాలికి సుమారు 6–7 ఏళ్ల పాటు ధోని బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేశారు. కానీ, దానికి ఆమ్రపాలి ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. చివరికి ఆమ్రపాలి బాధిత గృహ కొనుగోలుదారుల నుంచి నిరసనలు వ్యక్తం కావటంతో ధోనీ బ్రాండ్‌ అంబాసిడర్‌ కాంట్రాక్ట్‌ నుంచి వైదొలిగారు. రూ.150 కోట్లకు పైగా బకాయిలు రాబట్టుకోవటం కోసం ఆమ్రపాలిపై కేసు వేశారు.

Related Posts

Latest News Updates