తెలంగాణలో రెండు నెలల పాటు గోదాములకు అద్దె కట్టాల్సిన అవసరం లేదు. వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలోని ఖాళీ గోదాములను రైస్ మిల్లర్లకు అద్దె లేకుండా రెండు నెలల పాటు సరుకు నిల్వచేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాబోయే 4 నెలల్లో ఎఫ్‌సీఐ నుంచి కానీ, ప్రభుత్వ ఏజెన్సీ నుంచి ఇండెంట్ ఇవ్వని ఖాళీ గిడ్డంగులను మాత్రమే రైస్ మిల్లర్స్‌కు కేటాయించనున్నారు. రెండు నెలలకు మించి ఎట్టి పరిస్థితుల్లోను సరుకు నిల్వకు రైస్ మిల్లర్స్‌కు అనుమతివ్వకూడదని మార్కెటింగ్‌శాఖ నిర్ణయించింది. రైస్ మిల్లులకు గోదాములు కేటాయించే పూర్తి అధికారం సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్లకు ఉందని, దానికి అనుగుణంగా ఎంపిక చేసిన రైస్ మిల్లులకు గోదాములు కేటాయించాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన గోదాముల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన మిల్లు నుంచి కస్టమ్స్ మిల్లింగ్ బియ్యం మాత్రమే నిల్వ చేయాల్సి ఉంటుందని, ఇతర సరుకులు నిల్వ చేయడానికి వీలులేదని వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తే కిరాయి వసూలు చేయడంతో పాటు, మిల్లు లైసెన్స్ రద్దు చేస్తామని పార్థసారధి హెచ్చరించారు.