Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రోడ్డు స్థలాన్ని ఆక్రమించి మూడు షెటర్లు

రూ.30 లక్షల విలువ చేసే ఓ రోడ్డు స్థలం వివాదం రోజు రోజుకు జటిలంగా మారుతోంది. అప్పటి జిల్లా కలెక్టర్, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ ఆదేశాలతో 2011లో రూ.3 లక్షలతో ప్రహరీ నిర్మించిన స్థలంలో రోడ్డును ఆనుకుని ఇటీవల ఓ వ్యక్తి మూడు షటర్లను ఏర్పాటు చేయడం వివాదం రేపింది. సదరు నిర్మాణంపై ఇప్పటికే మూడు సార్లు ఫిర్యాదు చేసినా అధికారుల్లో ఉలుకు పలుకు లేదు. 120 గజాల స్థలం సుమారు రూ.25 నుంచి రూ.30 వేల వరకు గజం ధర పలుకుతుంది. కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని జీడిమెట్ల డివిజన్‌ ఎంఎన్‌రెడ్డి నగర్‌లో సర్వే నెంబరు 91లో 660 గజాల స్థలాన్ని గుర్తించి ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇదే స్థలానికి ఆనుకుని ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టాడు. 
90 రోజులుగా ఫిర్యాదుల పరంపర..
ఎంఎన్‌రెడ్డినగర్‌లో చేపడుతున్న ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ స్థానికులతో పాటు ఇటీవల దళిత సంఘం నాయకులు నక్క ప్రకాశ్‌ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన వారిపై జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఇలా మూడుసార్లు ఒకే నిర్మాణంపై ఫిర్యాదులు చేయగా టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు. అక్రమ నిర్మాణమని చెప్పినా ఇంత వరకు స్పందించకపోవడంతో 90 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. 
33/11 కెవి సబ్‌స్టేషన్‌ కోసం.. 
2011లో అప్పటి కాంగ్రెస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేఎం ప్రతాప్‌ ఆయా కాలనీల్లో నెలకొని ఉన్న లో వోల్టేజీ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకుని 33/11 కేవీ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం సర్వే నెంబరు 91లో ఉన్న స్థలాన్ని కేటాయించాలని కోరగా అప్పట్లో జిల్లా కలెక్టర్‌గా ఉన్న దానకిశోర్‌ ఇట్టి స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో ఏపీఎస్‌ఈబీ డైరెక్టర్‌ చొరవ సదరు స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం రూ.3 లక్షలు వెచ్చించి కట్టారు. అయితే ఆ స్థలం అప్పటి నుంచి వివాదంగా మారడంతో సబ్‌ స్టేషన్‌ నిర్మాణం నిలిచిపోయింది. తాజాగా ఇదే స్థలాన్ని ఆనుకుని మూడు షెటర్లు ఏర్పాటు చేయగా స్థానికులు అభ్యంతరం తెలుపుతూ ఫిర్యాదు చేస్తు వచ్చారు.

Related Posts

Latest News Updates