బాత్రూమ్, శానిటేషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ రోకా చిత్తూరులోని సెట్టిపల్లి, మహబూబ్‌నగర్‌లోని డీకే తండాలో రెండు వర్షపు నీటి రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ఈ ఏడాది జులైలో రిజర్వాయర్లను నిర్మాణం ప్రారంభమైందని.. వచ్చే ఏడాది జులై నాటికి పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. ఆయా రిజర్వాయర్ల ద్వారా సెట్టిపల్లిలో 5 ఉపరితల బావులు, డీకే తండాలో 21 బావుల్లో నీటి నిల్వ సాధ్యమవుతుందని, వీటిని స్థానిక వ్యవసాయానికి వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.
లెట్స్ మేక్ ఎ డీల్ ప్రాజెక్ట్..
రోకా కార్పెరేట్ యూనివర్సిటీ (ఆర్సీయూ), వీ ఆర్ వాటర్ ఫౌండేషన్ (డబ్ల్యూఏడబ్ల్యూఎఫ్) సంయుక్తంగా కలిసి నీటి నిర్వహణ, పునఃర్వినియోగం కార్యక్రమం ‘లెట్స్ మేక్ ఎ డీల్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా రోకా తయారీ కేంద్రాల్లో నీటి వినియోగం, పునఃర్వినియోగం అంశం మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇందులో భాగంగా దేశంలోని 18 తయారీ కేంద్రాలను సందర్శించింది. ఆయా ప్లాంట్లలో సుమారు 25.611 మిలియన్ లీటర్ల నీటిని ఆదా చేసింది. మన దేశం నుంచి అల్వార్, దేవాస్, పెరుందురై ప్లాంట్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఆయా ప్లాంట్ల నుంచి సుమారు 15,138 కిలో లీటర్ల నీటిని ఆదా చేసింది. ‘‘రోకాకు ఇండియా అతిపెద్ద మార్కెట్. సుమారు రూ.5 లక్షల విలువైన నీటిని ఆదా చేశామని, వీటిని ఫౌండేషన్ అభివృద్ధి ప్రాజెక్ట్‌ల కోసం దానం చేస్తున్నామని’’ వీ ఆర్ వాటర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ కేఈ రంఘనాథన్ తెలిపారు.
స్వాగతించాల్సిన అంశం..
భూమి మీద మూడింట రెండొంతుల వంతు నీళ్లే ఉన్నాయి. అదేంటో మరి, వినియోగించే స్థాయిలో నీళ్లు మాత్రం పరిమిత స్థాయిలోనే ఉన్నాయి. మెరుగైన జీవన విధానానికి నీళ్లు, శానిటేషన్ అనేవి చాలా ప్రధానమైనవి అని రంఘనాథన్ అన్నారు. నీటి నిర్వహణ మీద ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం స్వాగతించాల్సిన అంశమని, ఇది పర్యావరణహితమైన అంశం అని పేర్కొన్నారు.