Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమ్మవారి శరన్నవరాత్రులలో రెండవరోజు గాయత్రి దేవీ విశిష్టత….

పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది. బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై ‘వరం కోరుకో’ అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. ‘మరేదైనా వరం కోరుకో’ అన్నాడు.
అంతట, ఆ రాక్షసుడు “చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కాని, స్త్రీ పురుషులలో ఎవ్వరిచేత కాని, రెండు కాళ్ళు గల ప్రాణిచేత గాని, నాలుగు కాళ్ళ గల జంతువు చేతగాని, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేతగాని మరణం లేకుండా వరమి”మ్మని కోరాడు. బ్రహ్మ “తథాస్తు” అన్నాడు.
బ్రహ్మ దత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడుమని కబురు చేశాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొఱపెట్టుకున్నాడు. బ్రహ్మ అతన్ని వెంటపెట్టుకుని వైకుంఠానికి రాగా, విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి మొఱ విని, ఆ రాక్షసుడు గాయత్రీ జప పరాయణుడని, అతడు గాయత్రిని మానివేయడమో, మరచిపోవడమో చేస్తే తప్ప, అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి, అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించ వలసిందిగా సూచించాడు.
బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రీ జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి, బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూచి, అరుణుడు అతిథి సత్కారాలు చేసి,” మునీంద్రా నేను రాక్షసుడను కదా! మీరు దేవగురువులు. దేవతలు నాకు శత్రువులు నాతో మీకేమి పని? మీరాకకు కారణం ఏమిటి! అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, “రాక్షసరాజా! నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ, ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వూ జపిస్తున్నావు. కనుక, ఆ రీత్యా మనం మిత్రులమే కాని, శత్రువులం కాదు “అని సమాధాన మిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునితో దురభిమానము. దురహంకారము విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి, గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి, అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు.
గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు, దుర్భలుడు అయిపోయాడు, ఎందుకూ కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో బృహస్పతితో కలసి దేవిని ప్రార్థించగా, ఆమె వారికి సాక్షాత్కరించింది.

“వరాభయ కరా శాంత కరుణామృత సాగరా !

నానా భ్రమర సంయుక్త పుష్పమాలా విరాజితా||”

అయిన జగన్మాతను చూచి

“నమో దేవి మహావిద్యే సృష్టి స్థిత్యంతకారిణి|

నమః కమల పత్రాక్షి సర్వాధారే నమో7స్తుతే||

భ్రమరై ర్వేష్టితా యస్మాత్‌ భ్రామరీ యా తత స్స్మృతా|

తసై#్య దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమః||

అని పలువిధములుగా ఆమెను ప్రార్థించగా, ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది.

అంతట పరాశక్తి తన మాయా విలాసంచేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి ,భూమ్యాకాశాలను కప్పివేసి, రాక్షసుల శరీరాలను ఆక్రమించి, చెవుల్లో భరించరాని రొదచేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి , వినడానికి అవకాశం లేకుండై, కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా తేశాయి. దేవి అజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి, అరుణుని, అతని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే, శస్త్రాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద. చతుష్పాద ప్రాణులవల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు షష్పది(ఆఱు పాదాలు గలది తుమ్మెద) వల్ల మరణించాడు.

తమను కనికరించి, రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను అనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి, ఆమె అనుగ్రహం పొందసాగారు.

ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజయునకు గాయత్రీ వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు.!!

మీ
నందగోపాలవంశీకృష్ణశర్మ బిదురు

Related Posts

Latest News Updates