సీఎం ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసిన తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. శివసేన అధికారం కోసం పుట్టలేదని, అధికారమే శివసేన కోసం పుట్టిందంటూ వ్యాఖ్యానించారు.బాలా సాహెబ్ థాకరే మంత్రం కూడా ఇదేనని అన్నారు. సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయగానే తామెంతో భావోద్వేగానికి గురయ్యామని, ఉద్ధవ్ పై అందరికీ విశ్వాసం వుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చీఫ్, ఎన్సీపీ చీఫ్ సోనియా, పవార్ తమను విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఇక తన ఈడీ విచారణపై కూడా సంజయ్ రౌత్ స్పందించారు. ఈడీ విచారణకు తాను హాజరవుతానని ప్రకటించారు.
మహారాష్ట్ర తదుపరి సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టనున్నారు. బలపరీక్షను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు పేర్కొనడంతో, బలపరీక్షకు ముందే సీఎం ఉద్ధవ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా రెబెల్స్ నేత ఏకనాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.