Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

విద్యార్థి గృహాల వ్యాపారం రూ.4,970 కోట్లు

దేశంలో విద్యార్థి వసతి గృహాల పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తోంది. 2023 నాటికి స్టూడెంట్‌ హౌసింగ్‌/ కో–లివింగ్‌ స్పేస్‌ రంగం 700 మిలియన్‌ డాలర్ల (రూ.4970 కోట్ల)కు చేరుతుందని, 60 లక్షల పడకలు అదనంగా జత అవుతాయని స్టూడెంట్‌ అకామిడేషన్‌ ప్రొవైడర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఏపీఎఫ్‌ఐ), సీబీఆర్‌ఈ సంయుక్త నివేదిక తెలిపింది. 2019–23 మధ్య కాలంలో ఈ పరిశ్రమ ఏటా 36 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది.
ఎడ్యుకేషన్‌ హబ్స్‌తో డిమాండ్‌..
ప్రస్తుతం దేశంలోని ఉన్నత విద్యా రంగంలో ప్రతి ఆరుగురు విద్యార్థులకు ఒక్క హాస్టల్‌ బెడ్‌ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఆగస్టు నాటికి మొత్తం 2.50 లక్షల బెడ్స్‌ ఉన్నాయి. 2013–14లో దేశంలో 3.23 కోట్లుగా ఉన్న విద్యార్థుల సంఖ్య 2017–18 నాటికి 3.66 కోట్లకు పెరిగింది. ఏటా విద్యార్థులు, ప్రైవేట్‌ ఉన్నత విద్యా సంస్థల సంఖ్య పెరుగుతుంది. కొత్తగా ఎడ్యుకేషన్‌ హబ్స్‌ పుట్టుకొస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కళాశాలలున్నాయి. ఆయా రాష్ట్రాల్లో విద్యార్థుల నమోదు పెరిగింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని నగరాలు బెంగళూరు, జైపూర్, హైదరాబాద్, పుణే, నాగ్‌పూర్, ముంబై నగరాల్లో స్టూడెంట్‌ హౌసింగ్‌ పెరిగాయి.
30కి పైగా కంపెనీల పోటీ..
ఉన్నత చదువు నిమిత్తం విద్యార్థులు నగరాలకు వలస వెళ్లుతుండటం కారణంగా విద్యార్థి గృహాలకు డిమాండ్‌ పెరుగుతుంది. విద్యార్థులు ఇంటి యాజమాన్యం కంటే అద్దె, రెంట్‌ షేరింగ్‌ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఫుల్లీ ఫర్నిషింగ్, బ్రాండెండ్‌ సేవలంటే మరింత ఆసక్తి చూపిస్తున్నారు. విద్యార్థి గృహాలను అందించేందుకు స్టాంజా లివింగ్, కోహో, ప్లాసియో, ఓయో వంటి 30కి పైగా కంపెనీలున్నాయి.

Related Posts

Latest News Updates