Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

అసైన్డ్‌ భూములపై తెలంగాణ ప్రభుత్వం నజర్‌

అసైన్డ్‌ భూముల చిట్టాను రాష్ట్ర ప్రభుత్వం వెలికితీస్తోంది. నిరుపేదలకు వివిధ దశల్లో కేటాయించిన భూముల వివరాలను రాబడుతోంది. 1954 నుంచి ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల జాబితాను సేకరిస్తోంది. సామాజికవర్గాల వారీగా జరిగిన కేటాయింపుల సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ).. జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. భూమి లేని జీవనోపాధి పొందేందుకుగాను ఐదెకరాల్లోపు ప్రభుత్వం అసైన్‌మెంట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, చాలా చోట్ల ఈ భూములు చేతులు మారాయి. భూముల విలువలు గణనీయంగా పెరగడంతో పరాధీనమయ్యాయి. వాస్తవానికి అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ఈ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. ఈ నిబంధనలను తోసిరాజని ఆనేక చోట్ల ఈ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రజాప్రతినిధులు, బడాబాబులు కారుచౌకగా లభించే ఈ భూములను కొల్లగొట్టారు. ఒకవేళ అసైనీ(లబ్ధిదారు) చేతి నుంచి భూమి మారితే.. దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సివుంటుంది. అయితే, క్షేత్రస్థాయిలోని రెవెన్యూ సిబ్బంది పనిఒత్తిడి, చేతివాటమో తెలియదు కాదు కానీ, ఇలా పక్కదారి పట్టిన భూములను వెనక్కి తీసుకోవడం నామమాత్రమే. 2005లో మాత్రంలో కాస్తో కూస్తో ఇలా చేతులు మారిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతేడాది అసైన్‌మెంట్‌ భూముల కొనుగోలు చేసినవారికి కూడా వెసులుబాటు కల్పించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. భూమిలేని పేదలు ఈ భూములను కొంటే వారి పేరిట అసైన్డ్‌ చేసేందుకు సర్కారు అంగీకరించింది.
చిట్టా.. తర్వాతే
1954 నుంచి గత నెల 31వ తేదీవరకు జరిగిన భూ పంపిణీ సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏనిమిది విడతల్లో భూ కేటాయింపు జరగగా.. ఎంతమంది లబ్ధిదారులకు.. ఎంత విస్తీర్ణంలో భూములు అసైన్డ్‌ చేశారో నిర్దేశిత ఫార్మాట్‌లో మూడు రోజుల్లో పంపాలని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఇతరులకు పంపిణీ చేసిన భూమి? అయా భూముల్లో పోజిషన్‌లో ఉన్న లబ్ధిదారుల సంఖ్య? ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించిన విస్తీర్ణం? ప్రజావసరాల కోసం సేకరించింది..ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించింది. చట్టాన్ని ఉల్లంఘించడంతో వెనక్కి తీసుకున్న భూ విస్తీర్ణమెంతో లెక్క తేల్చాలని ఆదేశించింది. అలాగే, అసైనీల ఆధీనంలో ఉన్న భూమి వివరాలను పంపాలని సూచించింది. ఈ లెక్కల అనంతరం అసైన్డ్‌ భూములపై స్పష్టత వస్తుందని, తద్వారా ప్రభుత్వ భూముల వివరాలు కూడా తేలుతాయని అంచనా వేస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఐదెకరాల్లోపు క్రమబద్ధీకరణ?
అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదెకరాల్లోపు భూములను క్రమబద్ధీకరించే వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం..లబ్ధిదారుకు యాజమాన్య హక్కును కల్పించవచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పట్టాదార్‌ పాస్‌పుస్తకం జారీచేయడం ద్వారా ఆ భూమిపై అప్పులు పొందడం సులభతరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు చేతులు మారిన భూములను వెనక్కి తీసుకోవడమేగాకుండా.. ఆయా భూముల్లో పాగా వేసినవారి పేరిట క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఈ కేటగిరీ భూములను మార్కెట్‌ రేటుకు అటు ఇటుగా అమ్మే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసైన్డ్‌ భూముల లెక్క తేలిన తర్వాత.. గ్రేటర్, పట్టణ సంస్థల్లో ఇలాంటి భూముల్లో వెలిసిన కట్టడాలను కూడా క్రమబద్ధీకరించడం ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ ఆలోచన చాన్నాళ్లుగా ఉన్నప్పటికీ, ఈ ముసుగులో భూదందాలు జరిగితే నిలువరించడం కష్టమని భావనతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతోంది.

Related Posts

Latest News Updates