Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

టీఎస్‌ఎండీసీలో ఇసుకతో పాటూ గ్రానైట్, సున్నపురాయి కూడా!

ఇసుకతో పాటు ఇతర ఖనిజ విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చి పెడుతున్న తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎండీసీ) ఇతర ఆదాయ మార్గాలపైనా దష్టి సారిస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఇసుకతో పాటు ఇతర ఖనిజాల ద్వారా రూ.2,868.95 కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో ఇసుక ద్వారా ఏకంగా రూ.2,837.32 కోట్ల ఆదాయం లభించింది. ఇసుక తవ్వకాల ద్వారానే ఎక్కువ ఆదాయం లభిస్తుండగా, దీర్ఘకాలంలో ఇసుక వెలికితీత క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు టీఎస్‌ఎండీసీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. టీఎస్‌ఎండీసీని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే జాతీయ ఖనిజాన్వేషణ సంస్థ హోదాను కల్పించింది. దీంతో సూర్యాపేట, నల్గొండ, వికారాబాద్‌ జిల్లాల్లో సున్నపురాయి బ్లాక్‌లలో అన్వేషణ వెలికితీత పనులను టీఎస్‌ఎండీసీకి అప్పగిస్తూ.. ఖనిజాన్వేషణకు కోసం రూ.29 కోట్ల నిధులను జాతీయ ఖనిజాన్వేషణ ట్రస్టు కేటాయించింది. సున్నపురాయి అన్వేషణకు సంబంధించి ఇప్పటికే తొలి దశలో ప్రాథమికంగా నిర్దారణకు వచ్చిన టీఎస్‌ఎండీసీ.. ప్రస్తుతం రెండో దశలో పూర్తి స్థాయిలో తనకు కేటాయించిన సున్నపురాయి బ్లాక్‌లలో అన్వేషణ ప్రారంభించింది.
గ్రానైట్‌ వ్యాపారానికి టీఎస్‌ఎండీసీ మొగ్గు
నిర్మాణ రంగంలో వినియోగించే గ్రానైట్‌కు స్థానికంగా, విదేశీ మార్కెట్‌లో ఉన్న డిమాండును దష్టిలో పెట్టుకుని.. గ్రానైట్‌ వ్యాపారంలోకి సొంతంగా ప్రవేశించాలని టీఎస్‌ఎండీసీ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రానైట్‌కు ఉన్న డిమాండుకు అనుగుణంగా తొలుత రెండు రాష్ట్రాల్లో మార్కెటింగ్‌ను విస్తృతం చేయాలని నిర్ణయించింది. సొంత మార్కెటింగ్‌ వ్యవస్తను బలోపేతం చేసేందుకు ‘బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సెల్‌’ను ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయితే గ్రానైట్‌ వెలికితీత, గనుల అభివృద్ది పనులు శాఖాపరంగా చేయడం సాధ్యం కాని పక్షంలో.. అర్హత కలిగిన కాంట్రాక్టర్లకు గ్రానైట్‌ క్వారీల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల్లో 92.29 హెక్టార్లలో ప్రతీ ఏటా 36,400 క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ను వెలికితీయవచ్చని టెక్నో, కమర్షియల్‌ పీజిబిలిటీ నివేదిక ఆధారంగా అంచనాకు వచ్చింది. వంతడుపుల, తాళ్లపూసపల్లె, ఇనుగుర్తి, నమిలిగొండ, కొత్తగట్టులోని రెండు చోట్ల గ్రానైట్‌ నిల్వలు ఉన్నట్లు టీఎస్‌ఎండీసీ గుర్తించింది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో రోడ్‌ మెటల్‌ యూనిట్లు
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నిర్మాణ రంగం ఊపుమీద ఉండటంతో బండరాళ్ల తరలింపు నిర్మాణదారులకు సమస్యగా మారింది. మరోవైపు సహజ ఇసుక వినియోగం పెరగడంతో తరచూ కొరత ఎదురవుతోంది. దీంతో సహజ వినియోగాన్ని తగ్గించేందుకు మాన్యుఫ్యాక్చర్డ్‌ సాండ్‌ (కృత్రిమ ఇసుక) వైపుగా వినియోగదారులను మళ్లించేందుకు టీఎస్‌ఎండీసీ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోడ్‌ మెటల్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఖానామెట్, బండ రావిరాల, యాచారంలో ఏర్పాటయ్యే ఈ యూనిట్ల ద్వారా కంకర, కృత్రిమ ఇసుకను విక్రయించేలా ప్రతిపాదనలు సిద్దం చేసింది. ప్రస్తుతం పర్యావరణ అనుమతుల కోసం జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ఎండీసీ సంయుక్తంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రోడ్‌ మెటల్‌ విక్రయం ద్వారా టీఎస్‌ఎండీసీ ఆదాయం మెరుగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related Posts

Latest News Updates