Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కు.ని. ఆపరేషన్ వికటించడంపై సర్కార్ కు వారంరోజుల్లోగా నివేదిక ఇస్తాం : హెల్త్ డైరెక్టర్

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించింది. దీంతో ఇద్దరు మహిళలు మరణించారు. ఈ ఘటన మరువక ముందే… మరో ఇద్దరు మహిళలు కూడా కు.ని. ఆపరేషన్ వికటించి, మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య నాలుగుకి చేరింది. ఈ నలుగురికీ కలిపి తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మృతి చెందడంపై డీహెచ్ శ్రీనివాస్ స్పందించారు. 34 మంది మహిళలకు అనుభవం ఉన్న నిపుణులైన డాక్టర్లతోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించామని చెప్పారు. దురదృష్టవశాత్తు నలుగురు మహిళలు చనిపోవడం చాలా బాధాకరమన్నారు.

 

తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని డీహెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేయిస్తోందని ప్రకటించారు. నలుగురు మహిళలు చనిపోవడానికి అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందన్నారు. వారం రోజుల్లో దర్యాప్తు నివేదికను రాష్ర్ట ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా చనిపోయిన వారి పోస్టుమార్టం రిపోర్టులు కూడా దర్యాప్తులో చాలా కీలకమన్నారు. ప్రస్తుతం 30 మంది మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ రెగ్యూలర్ గా జరిగే ప్రక్రియని, దేశవ్యాప్తంగా ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతుంటాయని చెప్పారు.

Related Posts

Latest News Updates