తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా ఒకవైపు మొక్కలు నాటుతుంటే.. మరోవైపు నగరవాసులు మాత్రం బాధ్యత వహించట్లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12 ప్రధాన రహదారిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎదురుగా ఉన్న ఓ కాంప్లెక్స్ యజమాని రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్లను అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా కొట్టేశాడు. ఈ కాంప్లెక్స్ వ్యూకు అడ్డమొస్తున్నదని చెట్లను అడ్డంగా నరికేసి గుట్టుచప్పుడుకాకుండా ఉండిపోయారు. చెట్టును కొట్టేయాలంటే అటవీశాఖాధికారుల అనుమతి తీసుకోవాలి. పక్కనే కేబీఆర్ పార్కులో సంబంధిత అధికారులు ఉంటారు. వీళ్లకు చెట్లు కొట్టేసినా, మొక్కలు పీకేసినా ఏ మాత్రం పట్టదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్పితే అటువైపు తొంగిచూడరు. దీంతో ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత కొనసాగుతున్నది. చట్టప్రకారం చెట్లు కొట్టేయడం నేరం. ఒకరకంగా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయవచ్చు. ఈ చెట్లను నరికివేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.