తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మొక్కలు నాటిస్తుంటే.. మరో వైపు ఉప్పల్ సర్కిల్లోని రామంతాపూర్, హబ్సిగూడతో పాటు కొన్ని డివిజన్లలోని కాలనీలో, బస్తీలలో అంతర్గత రహదారులపై ఏపుగా పెరిగిన చెట్లను తమ భవన నిర్మాణాలకు తమ నివాసాల భవనాలకు, తమ వ్యాపార సంస్థలకు అడ్డుగా వస్తున్నాయని గుట్టుగా చెట్లను నరికేస్తున్నారు. ఏపుగా పెరిగిన వక్షాలు గొడ్డలి వేటుకు నేలకూలుతున్నాయి. దీంతో కొన్ని బస్తీలలో, కాలనీలలో ప్రధాన రహదారులు పచ్చదనం క్రమేణా కనుమరుగైపోతూ గొడ్డలి వేటుకు పలు వక్షాలు నేలకొరుగుతున్నాయి. రామంతాపూర్లోని ప్రగతినగర్ వంటి కాలనీలో పచ్చని చెట్లతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటే అదే కొన్ని కాలనీలలో, బస్తీలలోని రహదారిలో ఉన్న హరితహారం పథకం కింద నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. ఈ పెరిగిన చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు అడ్డుగా వస్తున్నాయని విద్యుత్ విభాగం ట్రిమ్మింగ్ పేరిట కొమ్మలు నరికేస్తున్నారు. ఈ నరికివేత కార్యక్రమంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొమ్మలతో పాటు చెట్ల మొద్దులను కూడా నరికేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం రామంతాపూర్లోని ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏపుగా పెరిగిన పలు చెట్లు ఓ విగ్రహ ఏర్పాటుకు అడ్డుగా వస్తున్నాయని యదేచ్చగా అధికారులు నరికివేశారు. ఈ విషయాన్ని పర్యావరణ ప్రియులు, మండల ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోలేదు.
అటవీ అధికారులు పట్టించుకోవాలి…
కాలనీలో, బస్తీలో యదేచ్చగా ఏపుగా పెరుగుతున్న చెట్లను నరికివేయడాన్ని అరికట్టడానికి అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో బస్తీలలో, కాలనీలలో పర్యటించి పచ్చదనాన్ని కాపాడాలని పలువురు కాలనీల సంక్షేమ సంఘం నాయకులు కోరుతున్నారు.
చెట్లు నరికితే జరిమానా, శిక్షలు వేయాలి..
ఉప్పల్ సర్కిల్లోని వివిధ డివిజన్లలోని కొన్ని బస్తీలలో, కాలనీలలో రహదారులపై ఏపుగా పెరిగిన చెట్లను తమకు అడ్డుగా వస్తున్నాయని కొంతమంది నరికివేస్తున్నారు. చెట్లు నరికిన వారికి జరిమాన విధించి శిక్షలు వేసి చెట్లను కాపాడే దిశగా అటవీ శాఖ అధికారులు కృషి చేయాలి.