గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్న కోకాపేటలో తెలంగాణ ప్రభుత్వం టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనుంది. 9 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ టౌన్షిప్లో కార్యాలయాలు రానున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ తెలిపారు. వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో టౌన్షిప్ పూర్తవుతుందని, సుమారు 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలుంటాయని చెప్పారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) ఆధ్వర్యంలో ‘రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ – ఎన్‌హ్యాన్సింగ్ లివబులిటీ’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని, అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం నగర సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను చేస్తోందని చెప్పారు.
వాణిజ్య భవనాల్లో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్..
కొత్త మున్సిపల్ చట్టం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించామని అర్వింద్‌కుమార్ తెలిపారు. కొత్తగా నిర్మాణంలోకి రానున్న వాణిజ్య భవనాలు, పెద్ద టౌన్షిప్స్లల్లో ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ పాయింట్స్‌ను తప్పనిసరిగా పెట్టాలనే నిబంధన ఉందని తెలిపారు. పారదర్శకమైన, సమగ్రమైన అభివృద్ధి కోసమే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ కొత్త మున్సిపల్ చట్టం 128 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్ కార్పొరేషన్స్, 7 కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నింటికీ వర్తిస్తుందని గుర్తు చేశారు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ విధానం మొత్తాన్ని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చామని చెప్పారు.
మెట్రోతో అనుసంధానం..
బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా వినియోగం హైదరాబాద్‌లో కేవలం 31 శాతం మాత్రమే ఉందని, అందుకే రహదారులపై ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతుందని అర్వింద్ కుమార్ తెలిపారు. అదే ముంబైలో 66 శాతం నుంచి 68 శాతం, ఢిల్లీలో 50 శాతానికి పైగానే ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు, తగ్గించేందకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా మెట్రో స్టేషన్స్, బస్ స్టేషన్స్లను అనుసంధానించనున్నట్లు తెలిపారు.
సమాంతర అభివృద్ధి జరగాలి: శేఖర్ రెడ్డి..
మాదాపూర్, గచ్చిబౌలి వంటి వెస్ట్ జోన్ తరహాలోనే హైదరాబాద్‌లోని ఇతర జోన్స్ కూడా సమాంతర అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐఐ తెలంగాణ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్యానెల్ కన్వినర్ సి. శేఖర్ రెడ్డి కోరారు.