Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గోషామహల్‌లో 2 ఎకరాల భూమి కబ్జా

హైదరాబాద్‌ నడిబొడ్డులో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. గోషామహల్‌లో తెలంగాణ సర్కారుకు ఉన్న ఏకైక ప్రభుత్వ భూమి కబ్జాదారులు ఆక్రమించేశారు. గంగాబౌలిలో సర్వే నంబర్‌ 50లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచేశారు. ఈ స్థలంలో ఆక్రమణదారులు రెండు ఫంక్షన్‌ హాల్స్, కమర్షియల్‌ షాపులు కట్టేశారు కూడా!
దుర్గా హజారీ, నీలా హజారీ..
ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో దుర్గా హజారీ భవన్, నీలా హజారీ భవన్‌ రెండు ఫంక్షన్‌ హాల్‌ ఉన్నాయి. 20కి పైగా షాపులను కట్టి లీజుకు ఉన్నాయి. కబ్జాలకు సంబంధించి పలుమార్లు స్థానికులు ఫిర్యాదు చేసినా రెవిన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని గోషామహల్‌ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌ ఆరోపించారు. ‘‘ఫంక్షన్‌ హాల్స్‌ నిర్మాణ దశలో ఉన్నప్పుడే స్వయంగా నేనే రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేశానని, అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని’’ రాజాసింగ్‌ పేర్కొన్నారు. ప్రారంభంలో తాత్కాలిక షెడ్లను వేసిన ఆక్రమణదారులు.. తక్కువ కాలంలోనే పెద్ద స్థాయిలో ఫంక్షన్‌ హాల్స్‌ కట్టేశారని ఆయన ఆరోపించారు.
కోర్ట్‌ కేసుల్లేవ్‌..
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఆక్రమిత ఫంక్షన్‌ హాల్స్‌ మీద గానీ, స్థలాల మీద గానీ స్థానికులు, రెవిన్యూ అధికారుల నుంచి కోర్ట్‌లో ఎలాంటి కేసులు లేవు. ప్రభుత్వం కూడా వీటిని కూల్చివేయలేదు. ఆక్రమణ వెనక పలు నేరచరిత్ర కలిగిన ముగ్గురు వ్యక్తులున్నట్లు తెలిసింది. వీరిపై గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నాయి.

Related Posts

Latest News Updates