Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

కోకాపేట, ఆదిభట్లలో భూముల కంటే నీళ్లే కాస్లీ గురూ!

గ్రేటర్‌ శివార్లలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం జరిగే నీటి వ్యాపారం కోట్లు దాటింది. రియల్‌ వెంచర్లుగా మారిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిసర గ్రామాల్లో ఇటీవలి కాలంలో నీటి వ్యాపారంపై ఆధారపడుతోన్న రైతాంగం.. ట్యాంకర్‌ యజమానుల సంఖ్య భారీగా పెరుగుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తమకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో సాగుచేస్తే వచ్చే దిగుబడులు ఆశాజనంగా లేకపోవడం, వర్షపాతలేమి, చీడపీడల నివారణకు అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తుండటం, తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు ఆశించిన మేర గిట్టుబాటు ధర లభించకపోవడంతో చాలా మంది రైతులు తమకున్న స్థలంలో బోరుబావులు తవ్వి నీటిని విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. అయితే రైతులకు గిట్టుబాటయ్యే మొత్తం కంటే రైతుల బోరుబావుల వద్ద నీటిని సేకరించి వాణిజ్య అవసరాలకు నీటిని విక్రయించే ట్యాంకర్‌ మాఫియాకు కోట్ల రూపాయల మేర లాభాలు సమకూరుతున్నాయని.. ఐఐటీ గౌహతి, నెదర్లాండ్స్‌కు చెందిన వేజ్‌ నింజెన్‌ వర్సిటీ నిపుణు ‘నీళ్లు ఎవరివి.. లాభాలు ఎవరికి’ అన్న అంశంపై చేసిన తాజా అధ్యయనంలో తేలింది.
ఔటర్‌ చుట్టూ..
ప్రధానంగా గత దశాబ్ద కాలంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల్లో రైతులు వ్యవసాయం కంటే ఇతర వృత్తులపైనే ఆధారపడేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక ఆయా శివారు గ్రామాల్లో ఐటీ, బీపీఓ, పారిశ్రామిక, లాజిస్టిక్స్‌ పార్కులు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రభుత్వం సైతం భారీగా రైతుల నుంచి భూములు సేకరించడంతో ఇక్కడ వ్యవసాయ భూముల సంఖ్య క్రమంగా తగ్గిందని వెల్లడించింది. విలువైన వ్యవసాయ భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించడంతో పాటు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన లే–అవుట్లలో బాధితులు కోల్పోయిన భూముల విస్తీర్ణం ప్రకారం నివాస స్థలాలు కేటాయించినట్లు తాము గుర్తించినట్లు అధ్యయనం చేపట్టిన నిపుణులు తెలిపారు. ఇక తమకిచ్చిన ప్లాట్లలో ఇప్పుడు బోరుబావులు తవ్వి ఆ నీటిని ఫిల్టర్‌ ప్లాంట్లు, ఇతర పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు విక్రయించి ఉపాధి పొందుతున్నామని పలువురు రైతులు వెల్లడించారని ఈ అధ్యయనం తెలిపింది. ప్రధానంగా కోకాపేట్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొందని వెల్లడించింది. కోకాపేట్‌లో పలువురు రైతులు తవ్విన బోరుబావుల నుంచి కార్పొరేట్‌ కంపెనీలకు, రిసార్ట్స్, రిక్రియేషన్‌ సదుపాయాలున్న స్థలాలు, విద్యాసంస్థలకు ట్యాంకర్‌ యజమానులు భారీగా నీటి సరఫరా చేసి భారీగా ఆర్జిస్తున్నట్లు పేర్కొంది.
విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం..
నీళ్లవ్యాపారంపైనే ఆధారపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండడం… విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం కారణంగా శివార్లలో భూగర్భజలాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో సరాసరిన 1000–1500 అడుగుల లోతుకు పైగా బోరుబావులు తవ్వాల్సి వస్తోందని.. కొన్ని చోట్ల ఆస్థాయిలో బోర్లు తవ్వినా నీటి చుక్క జాడ కనిపించడం లేదని ఈ అధ్యయనం స్పష్టంచేసింది. వర్షపు నీటి నిల్వ చేసేందుకు ఆయా ప్రాంతాల్లో వాణిజ్య, వ్యాపార, రియల్టీ వర్గాలు చర్యలు తీసుకోకపోవడంతో భూగర్భజలాల కొరత కూడా ఉత్పన్నమౌతోందని వెల్లడించింది. ఈ పరిణామంతో ఆయా గ్రామాల ప్రజలు నీటి కొరత ఎదుర్కొంటున్నారని.. చిన్న రైతులు సైతం నీటిలేమి కారణంగా వ్యవసాయం పక్కనబెట్టి ఇతర ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్నట్లు వెల్లడించింది.
రైతులవి నీళ్లు..లాభాలు ట్యాంకర్‌ మాఫియాకే…
నీటి వ్యాపారం కోసం రైతులు తమ వ్యవసాయ భూమిలో బోరుబావిని ఏర్పాటుచేసి నీటిని విక్రయిస్తే.. ఒక్కో ట్యాంకర్‌ (ఐదువేల లీటర్లు)కు రూ.150 నుంచి రూ.200 వరకు మాత్రమే లభిస్తోంది. అదే నీటిని తీసుకెళ్లి వాణిజ్య, పారిశ్రామిక, రిక్రియేషన్, రిసార్ట్స్, కార్పొరేట్‌ కంపెనీలు, విద్యాసంస్థలకు విక్రయిస్తున్న ట్యాంకర్‌ యజమానులకు ఒక్కో ట్రిప్పునకు డిమాండ్‌ను బట్టి రూ.800 నుంచి రూ.1200 వరకు గిట్టుబాటవుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. అంటే రైతుల నీళ్లు విక్రయించి ఆర్జించే మొత్తం కంటే ట్యాంకర్‌ యజమానులు సొమ్ము చేసుకునే మొత్తం ఐదు నుంచి ఆరు రెట్లు అధికంగా ఉందని వెల్లడించడం గమనార్హం.

Related Posts

Latest News Updates