Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి!

సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు, 1.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగలో 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీ ప్రదేశాన్ని దొడ్డు ఇసుకతో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి.
ఇంకుడు గుంతతో ఉపయోగాలివే..
ఈ ఇంకుడు గుంతలో సీజన్‌లో సాధారణ వర్షపాతం (20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో.. రోజుకు 1600 లీటర్ల నీటిని నేలగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడురోజుల అవసరాలకు సరిపోవడం విశేషం. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జలబ్యాంక్‌ ఏర్పాటుచేసిన వారవుతారు.
వర్షపునీటిలో 60 శాతం వృథా..
రాష్ట్ర రాజధానిలో నీటి బొట్టు కనుమరుగు కానుంది. వరుణుడు కరుణించినా.. వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితులు లేక గ్రేటర్‌ నగరంలో భూగర్భ జలమట్టాలు శరవేగంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు మహానగరం పరిధిలో 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం (130 మిల్లీమీటర్లు) కంటే 50 మిల్లీ మీటర్లు అధికం. కానీ విలువైన వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జి పిట్స్‌ తగినన్ని లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగకపోవడం పట్ల భూగర్భ జలనిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాంక్రీట్‌ మహారణ్యంలా మారిన గ్రేటర్‌లో 60 శాతం మేర వర్షపు నీరు వృథాగా పోతుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వర్షపు నీరు వరద రూపంలో 40 శాతం మేర వృథా అవడం సర్వసాధారణమే. కానీ నగరంలో దీనికి అదనంగా మరో 20 శాతం నీరు వృథా అవడం సిటీజనులు పాలిట శాపంగా మారుతోంది. ఈ నీటిలో సింహభాగం భూగర్భంలోకి మళ్లిస్తే జలమట్టాలు మరో రెండు మీటర్ల మేర పెరిగే అవకాశాన్ని చేతులారా వదులుకున్న పాపం జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాలదేనన్నది సుస్పష్టమౌతోంది.

Related Posts

Latest News Updates