Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హైదరాబాద్‌లో రియల్‌ రయ్‌..రయ్‌

హైదరాబాద్‌లో రియల్‌ పరుగులు పెడుతుంది. ఔటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ ఉన్న శివారు ప్రాంతాల్లో నివాస భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రెండేళ్లలో భూముల ధరలు రెట్టింపు కావడంతో కోట్లరూపాయలు గుమ్మరిస్తేగాని జాగా దొరకని పరిస్థితి నెలకొంది. శివారు ప్రాంతాల్లో నూతన ఐటీ, హార్డ్‌వేర్‌ పరిశ్రమల కార్యకలాపాలు పెరగడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు నెలకొనడం, ఔటర్‌రింగ్‌రోడ్డుతో అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ పెరడం, ప్రధాన రహదారుల విస్తరణ, హరితవాతావరణం, ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు, విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు భారీగా వెలియడంతో ఆయా ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. కుష్‌మన్‌ వేక్‌ఫీల్డ్‌ తాజాగా ఆయా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలపై చేసిన అధ్యయనంలో ఈ విశేషాలు వెల్లడయ్యాయి.
ఈ ప్రాంతాల్లో భూమి బంగారం…
గ్రేటర్‌ శివార్లలో భూముల ధరలు ప్రధాన నగరంతో పోటీపడి పెరుగుతున్నాయి. గతంలో అభివృద్ధి ప్రధాన నగరంలో మాత్రమే కేంద్రీకృతం కావడంతో భూముల ధరలు ఆయా ప్రాంతాల్లోనే చుక్కలను తాకేవి. ఇప్పుడు అభివృద్ధి గ్రేటర్‌ నలువైపులా విస్తరించడం, ఆయా ప్రాంతాల్లో వృత్తి, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, కుటీర పరిశ్రమలు నెలకొనడం, ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీ, లాజిస్టిక్‌ హబ్‌ల ఏర్పాటు వెరసి ఆయా ప్రాంతాల్లో నిర్మాణరంగ కార్యకలాపాలు గత రెండేళ్లుగా అనూహ్యంగా పెరిగాయి. ప్రధానంగా పటాన్‌చెరు, నానక్‌రామ్‌గూడా, తెల్లాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కొల్లూర్, రాయదుర్గం, బాచుపల్లి, కూకట్‌పల్లి, పుప్పాల్‌గూడా, కొంపల్లి, మేడ్చల్, ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో భూములకు డిమాండ్‌ భారీగా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో నివాస భూముల కోసం కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని ఈ అధ్యయనం పేర్కొంది. ఇక మంగల్‌పల్లి, బాటసింగారం ప్రాంతాలతో పాటు శంషాబాద్, పెద్దఅంబర్‌పేట్, మనోహరాబాద్, మియాపూర్‌ ప్రాంతాల్లో ప్రభుత్వం నూతనంగా లాజిస్టిక్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇక యధావిధిగా బంజారాహిల్స్,జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో భూముల ధరలు తాజాగానూ రికార్డు సృష్టించడం విశేషం.
ఏ దిక్కు చూసినా కోట్లే..
ఈ సంస్థ తాజా అధ్యయనంలో గ్రేటర్‌సిటీని నాలుగు భాగాలుగా విభజించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలను సుమారుగా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు బంగారం కావడానికి ప్రధాన కారణాలను విశ్లేషిస్తే..
గ్రేటర్‌ పడమర ప్రాంతం: రాయదుర్గం, పుప్పాల్‌గూడా, కొల్లూర్, కోకాపేట్, నానక్‌రామ్‌గూడా, తెల్లాపూర్, గోపన్‌పల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, బాచుపల్లి ప్రాంతాలున్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఐటీ, బీపీఓ, కెపిఓ, బ్యాంకింగ్, నాన్‌–బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ సంస్థల ప్రధానకార్యాలయాలు వేలాదిగా వెలిశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిసరాలకు క్యూ కడుతుండడంతో ఈ ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. అంకుర పరిశ్రమలు, సేవారంగం, నిర్మాణరంగ కంపెనీలకు ఈ ప్రాంతాలు కొంగుబంగారంగా నిలుస్తున్నాయి. ప్రధానంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలో ఉండడంతో ప్రధాన నగరంతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ బాగా పెరిగింది. మరోవైపు వ్యాపార,వాణిజ్య అవకాశాలు విస్తృతమయ్యాయి. సూక్ష్మ, మధ్యతరహా, భారీ పరిశ్రమలకు ఈ ప్రాంతాలు హబ్‌గా నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు ఈ ప్రాంతాల్లో కొలువై ఉన్నాయి. ఇక మన దేశంలోని ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలనుంచి వలస వస్తున్న వారితో పాటు విదేశీయులు సైతం వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య అవసరాల కోసం ఆయా ప్రాంతాల్లో తాత్కాలిక, స్థిర నివాసం ఏర్పరచుకొంటున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో ఆఫీస్‌ స్పేస్, నివాస సముదాయాలకు గిరాకీ బాగా పెరగడంతో బహుళ అంతస్తుల భవంతులు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లాలు భారీగా వెలుస్తున్నాయి. ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు ఇదే అదునుగా ఆయా వర్గాల అవసరాలకు అనుగుణంగా విలాసవంతమైన భవనాలను నిర్మించి విక్రయిస్తున్నాయి. దీంతో భూముల ధరలు కోట్లకు చేరుకోవడం విశేషం.
గ్రేటర్‌ తూర్పు ప్రారంతం..
ఉప్పల్, పోచారం ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉప్పల్‌లో మెట్రో డిపో ఏర్పాటు, కనెక్టివిటీ పెరగడం, హెచ్‌ఎండీఏ నూతనంగా ఏర్పాటుచేసిన మెట్రో సిటీ లే అవుట్, శిల్పారామం ఏర్పాటు కావడంతో పాటు వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని ఈ ప్రాంతం అక్కున చేర్చుకుంటోంది. ప్రస్తుతం కోర్‌సిటీకి ధీటుగా పురోగమిస్తోంది. ఇక పోచారంలో ఇన్ఫోసిస్‌ సంస్థతో పాటు ఇతర ఐటీ రంగ సంస్థలు ఒక్కొక్కటిగా వెలుస్తుండడంతో టెకీలు ఈ ప్రాంతంలో నివాస సముదాయాలు, ఫ్లాట్లు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
గ్రేటర్‌ ఉత్తర ప్రాంతం..
మేడ్చల్, కొంపల్లి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఒకప్పుడు ద్రాక్ష తోటలకు నిలయాలుగా మారిన ఈ ప్రాంతాలు ఇప్పడు ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాలకు కొంగుబంగారంగా నిలుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నివాస సముదాయాలు, ఫ్లాట్లు, ప్లాట్లతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా వాణిజ్య స్థలాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి.
గ్రేటర్‌ మధ్యభాగం..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. దశాబ్దాలుగా సంపన్నుల నివాసాలకు చిరునామాగా ఉన్న ఈ ప్రాంతాల్లో ఇప్పుడు చదరపు గజం భూమి సైతం లక్ష నుంచి రెండు లక్షల రూపాయలకు పైగానే పలుకుతోంది. ఈ ప్రాంతాల్లో అంతర్జాతీయ నిర్మాణ రంగ కంపెనీలు విలాసవంతమైన ఫ్లాట్లు, భవనాలు, ఆఫీస్‌స్పేస్‌ ఉండే వాణిజ్య భవంతులు, మాల్స్, మల్టీప్లెక్స్‌లు భారీగా నిర్మిస్తుండడంతో భూమి బంగారాన్ని తలపిస్తోంది.

Related Posts

Latest News Updates