Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వర్క్‌ ఫ్రం హోమ్‌ డోలాయమానంలో ఆఫీస్‌ స్పేస్‌!

– సందిగ్ధంలో 25 లక్షల చ.అ. కొత్త ఆఫీస్‌ స్పేస్‌
– లక్ష చ.అ. కార్యాలయ స్థలాల అగ్రిమెంట్లు రద్దు
– కో–వర్కింగ్‌కు డిమాండ్‌; 30 శాతం అద్దె తక్కువ
దేశీయ ఆఫీస్‌ స్పేస్‌ రియల్టీకి కొత్త చిక్కొచ్చిపడింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఐటీ, ఐటీఈఎస్, ఇతర కార్పొరేట్‌ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానానికి తెరలేపాయి. దీంతో కార్యాలయ స్థలాలకు ఇబ్బందులొచ్చాయి. కార్పొరేట్‌ కంపెనీలు అద్దెలు, ఇతరత్రా నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ఆఫీస్‌ స్పేస్‌ను తగ్గించేస్తుంటే.. చిన్న స్థాయి కంపెనీలు అగ్రిమెంట్లను రద్దు చేసి.. కో–వర్కింగ్‌ వైపు మళ్లుతున్నాయి.
ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో 75 శాతం అంటే సుమారు 4.5 లక్షలు, ఇండియాలో 3.5 లక్షల మంది ఉద్యోగులు వచ్చే ఐదేళ్ల వరకూ వర్క్‌ ఫ్రం హోమ్‌ ద్వారానే విధులు నిర్వహిస్తారని ప్రకటించింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్‌సీఎల్, విప్రో, ఇన్ఫోసిస్, డెల్‌ వంటి బహుళ జాతి కంపెనీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తారని ప్రముఖ ఇన్వెస్టర్‌ క్రిస్‌ గోపాలకృష్ణన్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఆఫీస్‌ స్పేస్‌ సందిగ్ధంలో పడింది. గతేడాది దేశంలో 4 కోట్ల చ.అ. నికర ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది 28 లక్షలకు మించి జరగలేదని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ అనరాక్‌ ప్రాపర్టీ అంచనా వేసింది. ఇప్పటికే కమర్షియల్‌ రియల్టీలో పెట్టుబడులు రాక తగ్గిపోయాయని, 2019 జనవరి – మార్చి మధ్య కాలంలో 1,704 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్స్‌ రాగా.. ఈ ఏడాది జనవరి – మార్చి మధ్య 712 మిలియన్‌ డాలర్లకు క్షీణించాయని తెలిపింది. వచ్చే 6–8 నెలల పాటు ప్రతికూల పరిస్థితులే ఉంటాయని, అమెరికా, సింగపూర్, ఇతర సావరిన్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలోనే ఉన్నారని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ డైరెక్టర్‌ అశుతోష్‌ లిమాయే తెలిపారు.
సందిగ్ధంలో 25 లక్షల చ.అ. స్పేస్‌..
లాక్‌డౌన్‌ తర్వాత కూడా మునుపటి మాదిరిగా వ్యాపార కార్యకలాపాలు జరగవనేది కాదనలేని వాస్తవం. దీని ప్రభావం ప్రత్యక్షంగా ఆఫీస్‌ స్పేస్‌ రంగం మీద పడుతుంది. లక్ష చ.అ. కంటే తక్కువ విస్తీర్ణం ఉండే చిన్న స్థాయి ఆఫీస్‌ భవనాల మీద తీవ్రమైన ప్రభావం ఉంటుందని యార్డ్స్‌ అండ్‌ ఫీట్స్‌ ఫౌండర్‌ కళిశెట్టి నాయుడు తెలిపారు. గేమింగ్, యానిమేషన్, అప్లికేషన్‌ కంపెనీలు, స్టార్టప్స్‌ తీసుకునే ఆఫీస్‌ స్పేస్‌ల జాయింట్‌ డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్లు రద్దు అవుతాయన్నారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్‌లో అమెజాన్, డెల్, ఎక్సేండర్, ఎస్‌ అండ్‌ ఎస్‌ వంటి కంపెనీలు సుమారు 25 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఇవన్నీ సందిగ్ధంలో పడే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. నిర్వహణ భారం నుంచి ఉపశమనం కోసం అద్దెదారులు వారి స్థల లీజు, అవసరాలను రీకాలిబ్రేట్‌ చేస్తారని పేర్కొన్నారు.
వర్క్‌ ఫ్రం హోమ్‌ లేదా కో–వర్కింగ్‌..
వర్క్‌ ఫ్రం హోమ్‌తో కంపెనీలకు ఖరీదైన ప్రాంతాల్లో ఆఫీస్‌ స్పేస్‌ లీజు, కొనుగోళ్ల వ్యయాలతో పాటూ ఉద్యోగులు రోజు వారి రాకపోకల సమయం ఆదా అవుతాయి. ఉద్యోగుల భద్రత కారణంగా ఉత్పాదకత పెరిగే అవకాశాలుంటాయి. కానీ, ఈ విధానంలో డేటా భద్రత అనేది ప్రధానమైన సవాల్‌. పైగా చాలా మంది ఉద్యోగులు తమ పనిని సమర్థవంతంగా నిర్వర్తించడానికి కార్యాలయాలు అందించే మౌలిక సదుపాయాల మీద ఆధారపడుతుంటారు. వృత్తిపరమైన మౌలిక వసతులు, స్థిరమైన పర్యవేక్షణ ఉంటుంది. ఇవి కేవలం అధికారిక కార్యాలయాలు మాత్రమే అందించగలవు. ఫైర్‌వాల్స్‌ వంటి టెక్నాలజీలతో కస్టమర్లకు డేటా భద్రత ఇవ్వగలిగితే ఆఫీస్‌ స్పేస్‌ మీద ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. స్థిరమైన ఆఫీసులకు బదులుగా ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ల వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని క్రెడాయ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్‌ రెడ్డి తెలిపారు. ఈ తరహా ఆఫీస్‌ స్పేస్‌ అద్దెలు 30 శాతం వరకు తక్కువగా ఉండటంతో పాటూ అన్ని రకాల మౌలిక వసతులుంటాయి కూడా. అద్దె ఒప్పందాల కాల వ్యవధిలో కూడా ఫ్లెక్సిబుల్‌ ఉంటుంది. గంట, రోజు, నెల వారీగా అద్దెలుంటాయి.
హైదరాబాద్‌లో అద్దెలు..
హైదరాబాద్‌లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మణికొండ వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (సీబీడీ) ప్రాంతాల్లో గ్రేడ్‌ ఏ ఆఫీస్‌ స్పేస్‌లో రూ.6,000 నుంచి రూ.9,000 మధ్య ఉంటుంది. నాన్‌ గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌లో అద్దె 15–20 శాతం తక్కువగా ఉంటాయి. అదే కో–వర్కింగ్‌లో అయితే నెలకు ఒక డెస్క్‌కు రూ.4,750 నుంచి రూ.7,650 మధ్య ఉంటుంది.
– పోచారం, ఉప్పల్‌ వంటి సెకండరీ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ (ఎస్‌బీడీ) ప్రాంతాల్లో గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్పేస్‌ అద్దె నెలకు ఒక డెస్క్‌కు రూ.3,500 నుంచి రూ.7 వేలుగా ఉంటే, నాన్‌ గ్రేడ్‌–ఏ ప్రాంతాల్లో 25–35 శాతం తక్కువగా ఉంటాయి. కో–వర్కింగ్‌ అద్దెలు రూ.3,600 నుంచి రూ.6 వేలుగా ఉంటాయి.

Related Posts

Latest News Updates