ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. 82,888 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. ఓ రకంగా వైసీపీది ఏకపక్ష విజయమే. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి వైసీపీ అభ్యర్థి ప్రత్యర్థులపై విజయం సాధిస్తూనే వచ్చారు. మొత్తంగా 20 రౌండ్లలో లెక్కింపు జరగగా, ప్రతి రౌండ్ లోనూ విక్రమ్ రెడ్డిదే ఆధిక్యం.
ఇక బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ రెడ్డి వైసీపీ అభ్యర్థి విక్రమ్ రెడ్డికి ఏమాత్రం పోటీ ఇవ్వలేదు. డిపాజిట్ కూడా కోల్పోయారు. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి 1,02,240 ఓట్లు వచ్చాయి.
రాష్ట్ర ఐటీ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరిగింది. వైసీపీ అభ్యర్థిగా మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి భరత్ కుమార్ తో పాటు ఇతరులు మొత్తం 14 మంది ఉప ఎన్నికల బరిలోకి దిగారు.