అకాల వర్షాలతో నష్టపోయిన మండలాల్లో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.వడగండ్ల వానతో దెబ్బతిన్న మామిడి, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యానవన పంటలతోపాటు మక్కజొన్న పంటల్లో కలియతిరిగారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మర్పల్లి, మోమిన్‌పేట్ మండలాల్లోని 13 గ్రామాల్లో వడగండ్ల వర్షం వల్ల 2 వేల ఎకరాల వరకు వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందని పేర్కొన్నారు.
పంట నష్టానికి సంబంధించి సమగ్ర సమచారాన్ని శనివారం సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ధైర్యం కల్పించేందుకు తాము పంటల పరిశీలనకు వచ్చినట్టు తెలిపారు. ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారని, అకాల వర్షాల బారిన పడకుండా యాసంగి పంట అంతకంటే ముందే చేతికొచ్చేలా రైతులు అప్రమత్తం కావాలని సూచించారు.ఈ విషయంలో రైతులను చైతన్య పరుస్తున్నామని, ఇప్పటికే నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, సూర్యాపేట ప్రాంతాల్లోని రైతులు అనుసరిస్తున్నారని మంత్రి తెలిపారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఈ పద్ధతిని పాటిస్తే ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడుకోగలుగుతామని చెప్పారు.