కేంద్రం ఇటీవలే తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక సవరణ చేసింది. దరఖాస్తు చేసేందుకు 17.5 నుంచి 21 ఏళ్లుగా ఉన్న అర్హత వయస్సును 23 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావమూ చూపదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా కల్పించింది.
మరోవైపు అగ్నిపథ్ నిరసలనపై మోదీ కేబినెట్ లో కీలక మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. చాలా మంచి లక్ష్యంతోనే దీనిని తీసుకొచ్చామని, అందరూ అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాలని, నాలుగేళ్ల తర్వాత ఉద్యోగం అయిపోతుందని అనుకోవద్దని, ఆ తర్వాత కూడా ఉద్యోగం, ఉపాధి వుంటుందన్నారు. ప్రజలు దీనిని సరిగ్గా అర్థం చేసుకుంటే నిరసన వెంటనే ముగుస్తుందని ఓ టీవీ డిబేట్ లో అన్నారు.