త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన కొత్త సర్వీసు అగ్నిపథ్ పై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా.. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శలు చేశారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. సైనిక నియామకాల్లో మార్పుల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై యువతలో అనేక ప్రశ్నలు, సందేహాలున్నాయన్నారు. నాలుగేళ్ల తర్వాత 75 శాతం అగ్నివీరులు ఎలాంటి పింఛను సదుపాయం లేకుండా రిటైర్డ్ అవుతారని, అలా రిటైర్ అయిన వారు నిరుద్యోగులుగా మిగిలిపోతారని ఆయన పేర్కొన్నారు.
ఏటా ఈ నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే వుంటుందని, ఇది యువతలో మరింత అసహనాన్ని పెంచుతుందని వరుణ్ గాంధీ ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేగాక 15 ఏళ్ల తర్వాత రిటైర్ అయిన రెగ్యులర్ సైనికులను తీసుకునేందుకు కార్పొరేట్ రంగం అంతగా ఆసక్తి చూపించదని, అప్పుడు వీరి పరిస్థితి ఏంటని వరుణ్ సింగ్ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. నాలుగేళ్లు సైన్యంలో చేరితే అది వారి చదువుపై ప్రభావం చూపుతుందని వరుణ్ గాంధీ లేఖ రాశారు.
బిహార్ లో తీవ్ర నిరసనలు… పోలీసుల లాఠీఛార్జ్
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీంను వ్యతిరేకిస్తూ బిహార్ లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిరసనకారులు రైలు బోగీలకు నిప్పు పెట్టారు. రైల్వే స్టేషన్లలో విధ్వంసం సఈష్టించారు. దీంతో పోలీసులు నిరసన కారులపై లాఠీఛార్జ్ చేశారు. పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. భారత సైన్యం, రక్షణ దళాల్లో ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న వాళ్లు ముఖ్యంగా ఈ నిరసనలో పాల్గొంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు.