వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద స్థాయి భూముల రీసర్వే చేపట్టడం లేదన్నారు. భూముల రీ సర్వే ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమమని వివరించారు. సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ఈ పథకంపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాధిక సాంకేతికతతో ఎవరూ టాంపర్ చేయలేని విధంగా భూ యజమానులకు భూహక్కు పత్రాలు అందిస్తున్నామని గుర్తు చేశారు
. ఈ తరం వారికి మాత్రమే కాకుండా… రాబోయే తరాలకు కూడా ఇది ఉపయోగమని తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తయ్యాక సరిహద్దుల వద్ద వేసేందుకు 31 లక్షల రాళ్లను కూడా సిద్థం చేసినట్లు అధికారులు సీఎం జగన్ కి తెలిపారు.
రోజుకు 50 వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరా చేసేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేశామని పేర్కొన్నారు. నిర్దేశించుకున్న టైమ్ లైన్ ప్రకారం కచ్చితంగా సర్వే పూర్తి చేయాలన్నారు. ఏప్రిల్ మూడో వారం నాటికి 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు సీఎంకి తెలియజేశారు.