ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి తన భర్త అనిల్ తో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఈడీ కార్యాలయం ముందు భర్తను కవిత ఆలింగనం చేసుకున్నారు. అలాగే న్యాయవాదులు శ్రీనివాస్ గౌడ్, న్యాయవాది సోమా భరత్ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చారు. అక్కడి నుంచి కవిత ఈడీ విచారణ నిమిత్తం కార్యాలయానికి వెళ్లిపోయారు. రామచంద్రపిళ్లైతో కలిపి కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం 6 గంటల వరకూ కవితను అధికారులు విచారించనున్నారు. అలాగే సౌత్ లాబీయింగ్, లావాదేవీల గురించి కూడా ఈడీ విచారిస్తోంది., బ్యాంక్ స్టేట్ మెంట్స్, ఇతర డాక్యుమెంట్లపైనా ఈడీ ఆరా తీసింది.
ఈడీ విచారణ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కవిత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన సంగతి తెలిసిందే. కవిత ఈడీ విచారణకు హాజరు కావడం ఇది రెండోసారి. ఈ నెల 11న కవిత తొలిసారి ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. మళ్లీ 16వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే.. తనకు ఆరోగ్యం బాగో లేదని, తాను హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. ఈ లేఖను తన తరపు న్యాయవాది సోమ భరత్ తో పంపించారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవిత మంత్రి కేటీఆర్ తో కలిసి ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ విచారణకు హాజరు కావాలా? వద్దా? అన్న దానిపై న్యాయ నిపుణులతో కవిత సుదీర్ఘంగా చర్చించారు. ఈడీ విచారణకు వెళ్లాలని కవితకు సీఎం కేసీఆర్(CM KCR) సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు వెళ్ళడమే మంచిదని మంత్రి కేటీఆర్ కూడా సూచించినట్లు సమాచారం. దీంతో ఈడీ విచారణకు హాజరు కావాలని కవిత డిసైడ్ అయ్యారు.