ఆమ్ ఆద్మీ పార్టీ (AA) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ ( ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో సిసోడియాని తీహార్ జైలుకు తరలించారు. అవినీతి కేసులో గత నెల 26 సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సీబీఐ కస్టడీలో ఉన్న సిసోడియాను నేడు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
కేసుకు సంబంధించి సిసోడియా నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. దాంతో కోర్టు మార్చి 20 వరకు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. కోర్టు తీర్పుతో మార్చి 20వ తేదీ వరకు సిసోడియా తీహార్ జైలులో ఉండనున్నారు.అయితే తనతో పాటు భగవద్గీత ప్రతిని కూడా తీసుకెళ్లడానికి అనుమతించాలంటూ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఓ డైరీ, పెన్ను, భగవద్గీత తీసుకెళ్లేందుకు అంగీకరించింది. అలాగే తనను మెడిటేషన్ హాలులో వుంచాలన్న సిసోడియా అభ్యర్థనను కూడా ఓ సారి చూడాలని కోర్టు సూచించింది.