తెలంగాణలో ఉత్తమ పనితీరు కనబర్చిన ఉత్తమ పంచాయితీలకు అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల కార్యక్రమం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి, మల్లారెడ్డి హాజరై, అవార్డులను ప్రదానం చేశారు. మొత్తం ఉత్తమ గ్రామ పంచాయితీలుగా 47 పంచాయితీలు అవార్డులు గెలుచుకున్నాయి. ఈ సందర్భంగా పల్లె ప్రగతిపై రూపొందించిన పుస్తకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి నర్సరీ, పార్కు, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ప్రతి ఇంటి ముందు చెట్లు, ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు గ్రామాల అభివృద్ధికి రూ.14,235 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు.తెలంగాణలో అన్నిరంగాలు సమాన స్థాయిలో అభివృద్ధి సాధిస్తున్నాయని, పరిశ్రమలు వస్తున్నాయి. పర్యావరణం బాగున్నది. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి జరుగుతున్నది. అన్నింటి సమతుల్యత జరుగుతున్నదని కేటీఆర్ వివరించారు. ఓ వైపు వ్యవసాయ విస్తరణ జరుగుతున్నదని, మరోవైపు ఐటీ ఎగుమతులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు.
ఇంతటి సమతుల్య ఆర్థిక వ్యవస్థ ఉన్నది కాబట్టే 9 సంవత్సరాల్లో అద్భుతాలు జరిగాయని ప్రకటించారు. సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులందరి సమిష్టి కృషి, సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు తెలంగాణకు 79 అవార్డులు వచ్చాయని చెప్పారు. రూర్బన్‌లో దేశంలో రెండో స్థానంలో ఉన్నాం. సాగిలో టాప్ 20 గ్రామాల్లో 19 తెలంగాణ గ్రామాలే వున్నాయని తెలిపారు.
గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడానికి గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శులతోపాటు ప్రజలు, పాలకవర్గం ఎంతో కృషి చేశారని మంత్రి ప్రశంసించారు. ‘అవార్డులు వచ్చిన గ్రామాలను ప్రోత్సహించాలి కాబట్టి జిల్లా స్థాయిలో అవార్డులు సాధించిన గ్రామాలకు రూ.10 లక్షల చొప్పున, రాష్ట్ర స్థాయి అవార్డు సాధించిన గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, జాతీయ స్థాయి అవార్డు సాధించిన పంచాయతీలకు రూ.30 లక్షల చొప్పున అదనపు నిధులు ఇస్తాం అని ప్రకటించారు.