రాహుల్ గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్ భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రాజ్ భవన్ వైపు కాంగ్రెస్ నేతలు వెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంలోనే కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత రేణుకా చౌదరి ఎస్సై కాలర్ పట్టుకున్నారు. దీంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులకు, ఆమెకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి, పీఎస్ కు తరలించారు. ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రవర్తించిన తీరుకు గాను రేణుకా చౌదరితో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైక్ ను దహనం చేశారు. అలాగే అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సుపై ఎక్కి మరీ తమ ఆందోళనను వ్యక్తం చేశారు. బస్సు అద్దాలను కూడా ధ్వంసం చేశారు.రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు ఇతర నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తమను రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందని నేతలు అంటున్నారు.