ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఏలూరు జిల్లాలో పర్యటించారు. వైఎస్సార్ ఆసరా పథకం మూడో విడత ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఈ శనివారం నుంచి ఏప్రిల్ 5 వ తేదీ వరకూవైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మూడో విడతగా 6,419.89 కోట్లను జమ చేయనున్నారు. దీని ద్వారా పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తాను పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నానని, మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. మహిళలకు ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పిస్తోందని, వ్యాపారవేత్తలతో ఒప్పందం చేసుకొని వ్యాపార మార్గాలు చూపామని, ఆసరా, చేయూత, సున్నావడ్డీ ద్వారా మహిళలకు అండగా నిలిచామని పేర్కొన్నారు.
పొదుపు సంఘాల పనితీరు అద్భుతంగా వుందని, పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ప్రకటించారు. ఇప్పటికే రెండు విడతల్లో 12,758.28 కోట్లు అందించామని, మూడో విడతలో భాగంగా 78.94 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాలకు సంబంధించిన సగటున వారికి వచ్చే బ్యాంకుల రుణాలు 14 వేల కోట్లు కాగా, ఈ రోజుల బ్యాంకు ద్వారా ఏటా 30 వేల కోట్లు జగటున అందుతున్నాయన్నారు. చంద్రబాబు వల్ల పొదుపు సంఘాలు దెబ్బతిన్నాయని, ఇప్పుడు మళ్లీ ఊపిరి పోసుకుందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు సగటున రూ.14 వేల కోట్ల రుణాలు అందించగా.. తమ ప్రభుత్వం ప్రస్తుతం రూ.30 వేల కోట్ల రుణాలు అందిస్తోందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పొదుపు సంఘాలకు ఇస్తున్న రుణాలపై వడ్డీని 7 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. వడ్డీని మరింత తగ్గించేందుకు బ్యాంకులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, భవిష్యత్తులో వడ్డీని తగ్గించేందుకు బ్యాంకులపై ఒత్తిడి తీసుకొస్తామని జగన్ వివరించారు.
వైఎస్సార్ ఆసరా మూడో విడత పంపిణీ ఉత్సవాలను పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 5 వరకు రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయని వివరించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.