ఏపీ బీజేపీలో మరో కొత్త వివాదం రగులుకుంది. నిన్ననే బీజేపీకి కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా చేసి వెళ్లిపోయారు. అది మరిచిపోకముందే… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధ్రీశ్వరికి, ఎంపీ జీవీఎల్ నరసింహా రావుకి మధ్య డైలాగ్ వార్ ప్రారంభమైంది. అన్ని పథకాలకూ ఎన్టీఆర్, వైఎస్సార్ పేర్లేనా? ఇంకా ఎవరూ లేరా? అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రాజకీయం కేవలం రెండు పార్టీలు, రెండు కుటుంబాలకు సంబంధించింది కాదన్నారు. మిగతా నేతలు ఎవరూ కనిపించరా? జిల్లాలకు ఇతరుల పేర్లు పెట్టినప్పుడు వంగవీటి మోహన రంగ పేరు ఎందుకు పెట్టరంటూ ఫైర్ అయ్యారు. దీంతో పురంధ్రీశ్వరి కౌంటర్ ఇచ్చారు. ఒకరు తెలుగు జాతికి గుర్తింపు తీసుకొచ్చి, పేదలకు పనిజమైన సంక్షేమం, 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, మహిళా విశ్వవిద్యాలయం లాంటివి అందిస్తే, మరొకరు ఫీజు రియంబర్స్ మెంట్, 108 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ అందించారని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, వైఎస్సార్ పేదలకు నిజమైన సంక్షేమం అందించారని కొనియాడారు.
