కళా తపస్వీ కె. విశ్వనాథ్ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదం నెలకొంది. ఓ గొప్ప దర్శకుడిని, గొప్ప వ్యక్తిని ఇండస్ట్రీ కోల్పోయిందంటూ అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన మరణానికి నివాళిగా శుక్రవారం ఒకరోజు అన్ని సినిమాల షూటింగులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛందంగానే షూటింగులను నిలిపేస్తున్నట్లు సినీ పరిశ్రమ ప్రకటించింది. కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన సినిమాలు, తెలుగుదనాన్ని, సంప్రదాయాన్ని ప్రతిబింబించే సినిమాలు అందించిన ఘనత ఆయనకే దక్కింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 5 దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంపై తనదైన ముద్రను వేసిన కళాతపస్వి కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో నిండిపోయింది.
