కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఇబ్బంది పెడుతోందని ఆమె తరపు న్యాయవాది సోమా భరత్ కుమార్ పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ దురద్దేశంతో కూడుకుందన్నారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు గైర్హాజర్ అయ్యారు. దీంతో ఈడీ అడిగిన ప్రశ్నలను ఆమె తరపు ప్రతినిధిగా సోమా భరత్ తో కవిత పంపారు. ఈ సందర్భంగా సోమా భరత్ ఈడీకి 12 డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చట్ట ప్రకారం కవిత విచారణ జరగడం లేదన్నారు. అక్రమంగా ఈడీ కవిత ఫోన్ ను సీజ్ చేసిందని ఆరోపించారు.
ఈడీ విచారణ అంశంపై సుప్రీంలో పిటిషన్ వేశామని, ఆ తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందన్నారు.
తమ హక్కులు సాధించడానికే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ వేశామన్నారు. ఇంటికి వచ్చి విచారించాలన్నది మహిళలకు ఉన్న హక్కు అని ఆయన స్పష్టం చేశారు. తప్పుడు కేసులు పెట్టి బీఆర్ఎస్(BRS) మహిళా నేతను వేధిస్తున్నట్లు సోమా భరత్ ఆరోపించారు. ఈడీ విచారణకు హాజరుకాబోమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. చట్టం ప్రకారం మహిళల్ని ఇంటి వద్దే విచారించాలని ఆయన గుర్తు చేశారు. సాయంత్రం ఆరు గంటల వరకే విచారించాలన్న నిబంధనను ఈడీ ఉల్లంఘించినట్లు సోమా భరత్ తెలిపారు.