కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ తెలంగాణ పీసీసీ ఛలో రాజ్ భవన్ పిలుపునిచ్చింది. వివిధ మార్గాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రాజ్ భవన్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తలు నడి రోడ్డుపైనే ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు.అలాగే రోడ్డుపై వున్న బస్సుపై ఎక్కి ఆందోళన నిర్వహించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నడి రోడ్డుపైనే కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఇక.. కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ లోకి చొచ్చుకొని వెళ్లకుండా ఖైరతాబాద్ చౌరస్తా వద్ద సిటీ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాజ్ భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వ్యవహర శైలి వల్లే ఇంత హంగామా జరిగిందని జగ్గారెడ్డి ఆరోపించారు.