TSPSC పేపర్ లీకేజీ కేసులో నిరాధార ఆరోపణలు చేసినందుకు మంత్రి కేటీఆర్ తనకు లీగల్ నోటీసులు పంపడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. నోటీసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని ప్రకటించారు. కేటీఆర్ 100 కోట్లకు నాపై పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీసులు పంపారని, కేటీఆర్ పరువు 100 కోట్లా? మరి యువత భవిష్యత్తు మూల్యమెంత? అని సూటిగా నిలదీశారు. పేపర్ లీకేజీలో తన కుట్ర వుందని కేటీఆర్ ఆరోపించారని, అలాగైతే కేటీఆర్ పై తాను ఎన్ని కోట్లకు దావా వేయాలి? అని బండి సంజయ్ ప్రశ్నించారు. సిట్ విచారణ అంశాలు అసలు కేటీఆర్ కి ఎలా లీక్ అవుతున్నాయి. మొదట ఇద్దరు మాత్రమే నిందితులన్న కేసీఆర్ కొడుకు పదుల సంఖ్యలో నిందితుల అరెస్టులు జరుగుతుంటే ఎందుకు నోరు విప్పడం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
ప్రశ్నాపత్రాల లీకేజీలో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు బిజెపి పోరాటం కొనసాగుతుంది. కేసీఆర్ కొడుకును మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దాకా, నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పన పరిహారం అందించే వరకు బీజేపీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.