దక్షిణ మధ్య రైల్వే కొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ రైలు సర్వీసును ప్రారంభించింది. ఇలా ఓ ప్రైవేట్ రైలు సర్వీసును ప్రారంభించి రికార్డులోకెక్కింది. భారత్ గౌరవ్ పేరుతో ప్రైవేట్ రైళ్లను నడుపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ ప్రైవేట్ రైలు తమిళనాడులోని కోయంబత్తూరు నార్త్ నుంచి మహారాష్ట్రలోని షిరిడీకి బయల్దేరింది. ఈ రైలులో మొత్తం 20 బోగీలుంటాయి.

ప్రారంభమైన తొలి రోజు 1,100 మంది ప్రయాణికులతో ఈ రైలు ప్రారంభమైంది. గురువారం మధ్యాహ్నానికి ఈ రైలు షిరిడీకి చేరుకుంటుంది. వాడి, ధర్మవరం, ఎలహంక, సేలం, ఈరోడ్, తిరువూరు స్టేషన్ల మీదుగా ఈ రైల్ వెళ్తుంది. అయితే.. మామూలు రైలుకు ఉన్నట్లుగానే ఈ ప్రైవేట్ రైలుకు కూడా రైల్వే పోలీసులు, ఏసీ మెకానిక్, అగ్నిమాపక సిబ్బంది వుంటారు. ఒక్క ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే అదనంగా వుంటారు. ఈ ప్యాకేజీలో భాగంగా వీఐపీ దర్శనం, ఏసీ బసతో పాటు టూరిస్ట్ గైడ్లు కూడా ప్రయాణికుల వెంబడి వుంటారు.