రాష్ట్రపతి అభ్యర్థిగా తాను బరిలోకి దిగలేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ తేల్చి చెప్పారు. తాను ఇంకా క్రియాశీల రాజకీయాల్లోనే చక్రం తిప్పాలని అనుకుంటున్నానని, తాను రాష్ట్రపతి పదవికి పోటీ చేయలేనని పవార్ మరోసారి పునరుద్ఘాటించారు. ఢిల్లీలోని కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సీఎం మమతా బెనర్జీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే శరద్ పవార్ పై వ్యాఖ్యలు చేశారు. దయచేసి తనను రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి విషయంలోకి లాగొద్దని విపక్ష నేతలకు తెగేసి చెప్పారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థికి కావాల్సిన సంఖ్యాబలం విషయంలో పవార్ కు ఏమాత్రం నమ్మకం లేదని, కచ్చితంగా ఓడిపోతామని, ఓడిపోయే దానికి బరిలోకి దిగడం ఎందుకున్న కచ్చితమైన ఊహాగానంతోనే పవార్ వెనకడుగు వేస్తున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన సభకు 17 పార్టీల నేతలు హాజరయ్యారు. అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం సోమవారం మరోమారు సమావేశం కావాలని నేతలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ సమావేశానికి గైర్హాజర్ అయిన పార్టీల విషయంపై సీఎం మమత స్పందించారు. వారు ఈ సమావేశంలో పాల్గొనకపోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు. ఈ సమావేశానికి చాలా పార్టీలు వచ్చాయని, హాజరుకాని పార్టీల నేతలకు ఇతర కార్యక్రమాలు ఉండి ఉంటాయని మమత అన్నారు.

మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్‌కృష్ణ పేరును వామపక్షాలు తెరపైకి తెచ్చాయి. ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోడానికి తనకు కాస్త సమయం కావాలని ఆయన విపక్షాలను కోరినట్లు తెలుస్తోంది. ఈయన పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా సేవలందించారు. అలాగే 2017 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. అయితే వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా గెలుపొందిన విషయం తెలిసిందే.