ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి ఏపీ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వభూషణ్ కి సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం చేశారు. విజయవాడ నుంచి ఛత్తీస్ గఢ్ కి బయల్దేరి వెళ్లిపోయారు. ఇంతకు ముందు రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులకు రాజ్ భవన్ సిబ్బంది వీడ్కోలు పలికారు. రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. తన మూడేళ్ల పదవీ కాలం అద్భుతంగా సాగిందన్నారు. రాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన సమయంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ప్రకటించారు. ఏపీ పట్ల తనకు ఎప్పటికీ అభిమానం వుంటుందన్నారు.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వీడ్కోలు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ మాట్లాడుతూ… సీఎం జగన్ చూపిన గౌరవం, ఆప్యాయత ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. కంఠంలో ప్రాణం వున్నంత వరకూ ఏపీ ప్రజలను గుర్తుంచుకుంటానని తెలిపారు. ఏపీ ప్రజల కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో వుందన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలు ఆదర్శంగా వున్నాయని కితాబునిచ్చారు. ఏపీ ప్రజలు అందించిన ప్రేమ, అభిమానం ఎంతో అద్భుతమైందన్నారు. సీఎం జగన్ ను తాను కుటుంబీకుడిగానే భావిస్తున్నానని, ఏపీ తన రెండో ఇల్లు అని ప్రకటించారు.