జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ పథకం కింద విదేశీ యూనివర్శిటీల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని తెలిపారు. పెద్ద పెద్ద యూనివర్శిటీల్లో గొప్ప గొప్ప వాళ్లను స్ఫూర్తిగా తీసుకొని, వారంతలా ఎదగాలని ఆకాంక్షించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం అమలుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ యేడాది టాప్ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడత సాయంగా 19.95 కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి, విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… ఈ పథకంలో భాగస్తులైన ప్రతి చెల్లెమ్మ, తమ్ముడు ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం మీపై పెడుతున్న పెట్టుబడితో అందరూ మెరుగైన స్థానానికి వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అప్పుడే ప్రపంచ స్థాయిలో మన దేశ, రాష్ట్ర ప్రతిష్ఠ పెరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ విషయంలో ఓ ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. విద్యార్థులకు ఆ అధికారి నెంబర్ కూడా ఇస్తామని, ఏ సమస్య వున్నా… ఒక్క ఫోన్ కల్ చేసి.. వెంటనే సహాయం తీసుకోవచ్చని సీఎం సూచించారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం అండగా వుంటుందని భరోసానిచ్చారు.
ప్రతిభతో విదేశీ వర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్నప్పటికీ… ఆర్థిక స్తోమత లేక చదువులకు దూరం కాకూడదన్న సంకల్పంతోనే పేద విద్యార్థుల కోసం ఈ పథకం తెచ్చామని సీఎం జగన్ అన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ లాంటి గొప్ప నేతలు, మైక్రోసాఫ్ట్ సత్యనాదెళ్ల, ఐబీఎం సీఈవో, అడోబ్ సీఈవో శంతను నారాయణన్, గూగుల్ సుందర్ పిచాయ్.. ఇలా అందరూ గొప్ప గొప్ప యూనివర్శిటీల్లో చదువుకున్న వారేనని ఉదహరించారు.