టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టైన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. TSPSC లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి వుందా? అంటూ సవాల్ విసిరారు. పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం ఎవరైనా లీక్ చేస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. మరి ముందు రోజు తెలుగు ప్రశ్నాపత్రం ఎవరు లీక్ చేశారు? అంటూ సూటిగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ వి చిల్లర బుద్ధులని, తమవి కావని ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఎవరో ప్రశ్నాపత్రం పంపిస్తే తనకేమి సంబంధమని మండిపడ్డారు.
పేపర్ లీక్ తో తనకు సంబంధం లేదని తన పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తానని అన్నారు. తాను కుట్ర చేసినట్లు వరంగల్ సీపీ ఆరోపించారని, ఆయనకు ప్రమాణం చేసే దమ్ముందా? అంటూ సంజయ్ విరుచుకుపడ్డారు. సీపీ చెప్పిందే గనక నిజమైతే… తన మూడు సింహాల టోపీపై ప్రమాణం చేసి చెప్పాలన్నారు. అసలు తనను గంటల తరబడి ఎందుకు వాహనాల్లో తిప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ఓ రాజకీయ నేతనని, చాలా మందితో సెల్ఫీలు దిగుతానని, అందరితోనూ లింకులున్నట్లా? అని బండి ప్రశ్నించారు.
ఇక… ప్రధానంగా బండి సంజయ్ ప్రభుత్వ ముందు మూడు డిమాండ్లను వుంచారు. TSPSC పేపర్ల లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని.. అప్పుడే దోషులందరూ బయటకు వస్తారని.. కచ్చితంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీలో మంత్రి కేటీఆర్ పాత్ర ఉందని.. ఆయన్ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారాయన.
మరో డిమాండ్ ఏంటంటే.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని.. ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారాయన. ఈ మూడు డిమాండ్లు కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసే వరకు ఉద్యమం చేస్తూనే ఉంటామని.. ప్రతి జిల్లాల్లో.. ప్రతి మండలంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. త్వరలో వరంగల్‌లో నష్టపోయిన యువతతో ర్యాలీ చేస్తామన్నారు . కేసీఆర్ కుటుంబాన్ని వదిలేది లేదని తేల్చి చెప్పారు.