తెలంగాణలో పేపర్ లీకేజీల యుగం నడుస్తోంది. మొన్నటికి మొన్న TSPSC పేపర్ లీకేజీ అయ్యింది. దీనిపై ఇప్పటికీ నిరసన జరుగుతూనే వుంది. ఇది మరిచిపోకముందే టెన్త్ పేపర్ లీక్ అయ్యింది. ఈ వ్యవహారం ప్రజల మెదడులో నానుతుండగానే.. ఉట్నూరులో మరో ఘటన జరిగింది. ఉట్నూరు మండల కేంద్రంలో పదో తరగతి ఆన్సర్ షీట్ ల కట్ట మిస్సయ్యింది. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్ కి తీసుకొస్తున్న క్రమంలో ఆటోలో నుంచి మిస్సైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇలా 20 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్లు కనిపించకుండా పోయాయి. పోస్టల్ అధికారి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తెలిసొచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు.
అయితే.. దీనిపై డీఈవో ప్రణీత మాట్లాడారు. ఉట్నూరు పదో తరగతి జవాబు పత్రాలు మాయం అయ్యాయని, 20 మంది విద్యార్ధుల తెలుగు జవాబు పత్రాలు మాయమైనట్లు ప్రకటించారు. పోస్టాఫీస్ నుంచి బస్తాండ్ కి తరలిస్తుండగానే అవి పోయాయని, కాబట్టి పోస్టల్ అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. పోస్టల్ వారికి ఆన్సర్ షీట్లు అప్పగించినట్లు తమ దగ్గర రిసిప్ట్ కూడా వుందన్నారు. ఇందులో తమ శాఖా తప్పిదం ఏమీ లేదన్నారు.