ఢిల్లీలోని బంగ్లాను ఖాళీ చేయాలని రాహుల్ గాంధీకి లోక్ సభ సెక్రెటేరియట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ ఈ నోటీసులపై స్పందించారు. ఇల్లు ఖాళీ చేయాలన్న నోటీసుకు కట్టుబడి ఉంటానని ఆయన లోక్‌సభ సెక్రటేరియట్ కు లేఖ రాశారు.అధికారుల ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని హామీ ఇచ్చారు. లోక్ సభ సెక్రెటేరియట్ పంపిన లేఖ తనకు అందిందన్నారు.
ప్రజల తీర్పుతో 4 సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యానని, 12 తుగ్గక్ లేన్ లో తనకు కేటాయించిన బంగ్లాలో వుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ బంగ్లాలో తనకు చాలా జ్ఞాపకాలు వున్నాయన్నాని పేర్కొన్నారు. తన హక్కులకు భంగం కలగకుండా.. లేఖలో పేర్కొన్న విధంగా వ్యవహరించడానికి సదా సిద్ధంగానే వుంటానని, అది తన బాధ్యత కూడా అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. ఆదేశాల ప్రకారం బంగ్లాను ఖాళీ చేస్తానని రాహుల్ ప్రకటించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు కేటాయించిన ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు పంపింది. ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేసి అక్కడి నుంచి నిష్క్రమించాలని నోటీసుల్లో తేల్చి చెప్పింది. ఎంపీగా లోక్ సభ సెక్రెటేరియట్ అనర్హత వేటు వేయడంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్యానెల్ స్పష్టంగా తన నోటీసుల్లో పేర్కొంది.
ఇక నుంచి నెలవారీగా అందే జీతం, అలవెన్సులు, ఫోన్ , మెడికల్ సౌకర్యాలు కూడా రద్దు కానున్నాయి. అనర్హత వేటు పడిన ఎంపీకి ప్రభుత్వ బంగ్లాలో ఉండే అర్హత ఉండే అర్హత లేదని ప్యానెల్ స్పష్టం చేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరును ఉద్దేశించి మితిమీరిన వ్యాఖ్యలు చేశారు. దీంతో సూరత్ కోర్టు జైలు శిక్ష విధించడం, ఆయనపై అనర్హత వేటు పడటం తెలిసిందే.